Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీజేఎస్ ఆవిర్భావ దినోత్సవంలో కోదండరామ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం వేరే పార్టీల్లో గెలిచిన నాయకులకు డబ్బులు కుమ్మరించి కొనుక్కుని అధికారం నిలబెట్టుకోవాలని చూస్తున్నారని తెలంగాణ జన సమితి (టీజేఎస్) రాష్ట్ర అధ్యక్షులు, ప్రొఫెసర్ కోదండరామ్ విమర్శించారు. స్వార్థపూరిత రాజకీయాలు చేస్తున్నారని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్, నాంపల్లిలోని టీజేఎస్ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నాలుగోవ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండావిష్కరించారు. రాష్ట్రంలో నిరంకుశపాలన చేస్తూ ప్రజా సమస్యలను పట్టించుకోకుండా, ఇప్పుడు భారతదేశానికి కొత్త ఎజెండా కావాలంటూ మళ్ళీ కుటిలపూరితమైన రాజకీయాలు చేస్తున్నారనీ, దేశం గురించి మాట్లాడే ముందు రాష్ట్రంలో ఇప్పటి వరకు మీరు చేసిందేటని ప్రశ్నించారు. నిరుద్యోగం గురించి మాట్లాడితే, కేసులు పెట్టి అరెస్టులు చేయించారని గుర్తు చేశారు. ఎనిమిదేండ్లుగా రాష్ట్రంలో ఎంతో మంది నిరుద్యోగులు చనిపోయారనీ, కనీసం వారిని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రెండు లక్షల 80 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయనీ, పోరాట ఫలితంగా కొన్ని మొక్కుబడిగా ఉద్యోగాలు వేస్తున్నారని చెప్పారు. జాబ్ క్యాలెండర్‌కు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో విద్యా, వైద్యం సామాన్యులకు పూర్తిగా ఉచితంగా అందించేలా పోరాడాల్సిన అవసరముందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షులు గంగపురం వెంకట్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శులు గోపాగాని శంకర్రావు, నిజ్జన రమేష్ ముదిరాజ్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఎం నర్సయ్య, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు సీహెచ్ సత్యనారాయణ, జశ్వంత్, హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి బట్టల రాంచందర్, పుష్పాలత, జీవన్‌రెడ్డి, ఎర్ర వీరన్న, మధు పాల్గొన్నారు.