Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎస్ఐ, కానిస్టేబుల్, ఇతర యూనిఫాం ఉద్యోగాల వయో పరిమితిని ఐదేండ్లకు పెంచాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) జాతీయ ఉపాధ్యక్షులు విజరు,రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులు కోట రమేష్, ఆనగంటి వెంకటేష్ శుక్రవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాలుగేండ్లుగా ఎలాంటి నోటిఫికేషన్లు వేయకపోవటంతో ఎంతో నిరాశతో ఉన్న నిరుద్యోగులకు పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ నిర్వేదాన్నే మిగిల్చిందని తెలిపారు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లలో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు మూడేండ్ల వయస్సు పరిమితిని మాత్రమే పెంచటంతో చాలామంది నిరుద్యోగ యువత నష్టపోతున్నారని పేర్కొన్నారు. నాలుగేండ్లలో రెండు సార్లు రావాల్సిన నోటిఫికేషన్లు ఒక్కసారే ఇవ్వటంతో నిరుద్యోగులకు కాలం గంగలో కలిసిందని తెలిపారు. ప్రస్తుతం ఇచ్చిన పోలీస్ పోస్టుల ద్వారానైనా ఉద్యోగం సంపాదించాలనుకుంటే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ వయసు పెంచక పోవటం వల్ల నిరుద్యోగుల ఆశలన్నీ గల్లంతయ్యాయని పేర్కొన్నారు. అగ్నిమాపక, ఎక్సైజ్ శాఖల్లో వయస్సు పరిమితి 38 సంవత్సరాలు ఉంటే 30 ఏండ్లకు తగ్గించి మరింత నిరుద్యోగుల కడుపుకొట్టే చర్యలు చేసిందని విమర్శించారు.