Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాహుల్ గాంధీ సభ.. చరిత్రలో నిలిచిపోవాలి
- నెల్లికల్ లిఫ్ట్ ఏడాదిలో పూర్తి చేస్తామని చేతులెత్తేశారు
- రైతులను వరి వేయొద్దని కేసీఆర్ ఎందుకు వేశారు?: టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్‌రెడ్డి
- రైతుల విషయంలో ప్రభుత్వ అసమర్థత : ఎంపీ ఉత్తమ్
- నాయకులు కలిసికట్టుగా సాగాలి: జానారెడ్డి
నవతెలంగాణ-పెద్దవూర
అకాల వర్షానికి తడిసిన.. మొలకెత్తే ధాన్యాన్ని మద్దతు ధరకు కొనాల్సిందేనని టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. కనీసం గోనె సంచుల కోసం టెండర్లు పిలిచినా వేసే దిక్కులేదన్నారు. వరంగల్లులో నిర్వహించనున్న రాహుల్ గాంధీ బహిరంగ సభ చరిత్రలో నిలిచి పోయేలా ప్రతి కార్యకర్తా సైనికుడై పోరాడాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఉమ్మడి నల్లగొండ జిల్లా సన్నాహక సమావేశం నాగార్జునసాగర్ రెడ్డిఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లాకు సాయుధ పోరాట పటిమ గల నాయకత్వం ఉందన్నారు. నాగార్జునసాగర్ డ్యామ్‌ను కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కట్టామని సగర్వంగా చెప్పుకుంటామన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న మిగతా ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ హయాంలోనే పూర్తయ్యాయన్నారు.
కాంగ్రెస్ మొదలుపెట్టి చివరి దశలో ఉన్న ప్రాజెక్టులను కూడా పూర్తి చేయలేని దద్దమ్మ టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. నెల్లికల్ లిఫ్ట్ ఏడాదిన్నరలో పూర్తి చేస్తామని ఇప్పటికీ మొదలు పెట్టలేదని విమర్శించారు. భూ కబ్జాలు చేసే ఎమ్మెల్యే సైదిరెడ్డి.. ఇసుక మాఫియాకు పాల్పడే మంత్రి జగదీశ్‌రెడ్డి అని ఎద్దేవా చేశారు. జానారెడ్డి లాంటి పెద్దమనుషులు చట్టసభల్లో లేకపోవడం వల్ల సభలకు గౌరవం తగ్గిందన్నారు. ఏ సమస్య వచ్చినా పరిష్కరించే సత్తా ఉన్న నాయకత్వం కాంగ్రెస్ పార్టీలో ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీలో పులులు, సింహాలు ఉన్నాయని.. ఆ పులులను నడిపించే సత్తా ఉన్న నాయకులు జానారెడ్డి అని తెలిపారు. ల్యాండ్, ఇసుక మాఫియాలు, మర్డర్లు చేసే టీిఆర్‌ఎస్ నేతలకు తగిన గుణపాఠం చెప్పడానికి నల్లగొండ బిడ్డలు ముందుకు కదలాలని కోరారు. రైతులను వరి వేయొద్దన్న సీఎం కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌లో 150 ఎకరాల వరి ఎందుకు వేశారని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో మార్చి నెలలోనే ప్రభుత్వాన్ని హెచ్చరించినా మిల్లర్లకు కేటాయించలేదన్నారు. బస్తాలు లేక.. అకాల వర్షాలకు తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని మద్దతు ధర కల్పించి కొనాలని డిమాండ్ చేశారు. కేంద్రానికి రాష్ట్రానికి రాజకీయ ప్రయోజనమే కావాలి.. రైతు ప్రయోజనం అవసరం లేదాని ప్రశ్నించారు. రైతుల ఆత్మగౌరవం కోసం జరుగుతున్న వరంగల్ సభ ద్వారా రైతులకు మేలు జరగాలన్నారు.
ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతుల విషయంలో ప్రభుత్వ అసమర్థతను, తీరును ఎండగట్టడానికే రాహుల్ సభ పెడుతున్నామన్నారు. మిర్చి పండించిన రైతుకు కేసీఆర్ కన్నీరు పెట్టిస్తున్నా రన్నారు. వరంగల్ సభ ద్వారా వరి రైతులను, మిర్చి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయబోతున్నామని తెలిపారు.
మాజీ మంత్రి కుందురు జానారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా దేశాన్ని ఆకర్షించిన జిల్లా నల్లగొండ అన్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సభ్యత్వం చేసి దేశంలోనే మొదటి స్థానంలో ఉందని తెలిపారు. వరంగల్ సభ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి దిక్సూచి అన్నారు. నాయకులందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని కోరారు. పార్టీని ప్రభుత్వంలో నిలబెట్టేది ఉమ్మడి నల్లగొండ జిల్లానేనని చెప్పారు.
మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ.. 2002లో బీసీ గర్జనకు సోనియాగాంధీని ఆహ్వానించామని.. దాని తరువాత అధికారంలోకి వచ్చి 10 ఏండ్లు పేదల కష్టాలు తీర్చామని చెప్పారు. ఈరోజు పచ్చటి పైర్లు ఉన్నాయంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ప్రాజెక్టులే కారణమని చెప్పారు. రైతు సంఘర్షణ సభలో రైతుల విషయంలో ప్రభుత్వాలను ఎండ కట్టడమే కాకుండా.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు ఏం చేస్తామో స్పష్టంగా చెబుతామ న్నారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో 12 స్థానాలకు 12 కాంగ్రెస్ గెలుచుకుంటుందని దీమా వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి గీతారెడ్డి మాట్లాడుతూ.. మన నాయకుడు రాహుల్ గాంధీ సభకు 5 లక్షలు కాదు 10 లక్షల మంది తరలివస్తారనే నమ్మకం కలిగిం దన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, జెడ్పీ మాజీ వైస్‌చైర్మెన్ కర్నాటి లింగరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి, యువజన కాంగ్రెస్ నాయ కులు జయవీర్ రెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్య క్షులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు.