Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎక్కడ అడుగుపెట్టినా ఓటమే.. కాంగ్రెస్‌ది గత చరిత్రే
- బీజేపీ రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని.. పెట్టుబడులు రెట్టింపు చేసింది : నిజామాబాద్ జిల్లాలో మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ-వర్ని
'తెలంగాణకు రాహూల్ గాంధీ వస్తడు.. ఉద్దరిస్తడు అంటున్నరు.. ఆయనది ఐరన్‌లెగ్.. ఎక్కడ అడుగుపెట్టినా ఓటమే.. ఈ మధ్య కాలంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ ఓడింది 94 శాతం.. గెలిచింది ఆరు శాతం మాత్రమే'నని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. శుక్రవారం కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. మొదట నసురుల్లాబాద్‌లోని దుర్కి శివారులో రూ.40 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బీఎస్సీ నర్సింగ్ కాలేజీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జకోరా గ్రామంలో 69.52 కోట్ల వ్యయంతో నిర్మించనున్న జకోరా ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో కరెంట్ లేక మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయేవనీ, ఎరువుల కోసం లైన్లు కట్టాల్సిన పరిస్థితి ఉండేదని, ఇలా రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని విమర్శించారు. బీజేపీ సైతం రైతులను నట్టేట ముచ్చిందన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని బీజేపీ మానిఫెస్టోలో చెప్పి.. పెట్టుబడి ఖర్చులు రెట్టింపవ్వడం, బాయిలకాడ మీటర్లు పెట్టడం, ఎరువులు, డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచడం తప్ప చేసిందేమీ లేదన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు.. రూ.70 ఉన్న డీజిల్ నేడు రూ. 110 అయిందనీ, ఎకరా దున్నాలంటే.. రూ. 2వేల నుంచి రూ.6వేల కిరాయి పెరిగిందనీ, వరి కోత వెయ్యి నుంచి రూ.2500 అయ్యిందని తెలిపారు.
తెలంగాణ వచ్చాక స్వరాష్ట్రంలో ప్రాజెక్టులు కడుతుంటే రైతుల కండ్లల్లో ఆనందం కనిపిస్తే కాంగ్రెస్, బీజేపీ నాయకులకు కండ్లు మండుతున్నాయని అన్నారు. తెలంగాణ వచ్చిన నాడు 99 లక్షల టన్నుల ధాన్యం పండితే.. గతేడాది 2.59 కోట్ల టన్నులు పండాయనీ, ఇలా దేశానికే అన్నం పెట్టే స్థాయికి రాష్ట్రం చేరిందని తెలిపారు. ఇదంతా ప్రాజెక్టులు కట్టి సాగునీరు సరఫరా చేసి, 24 గంటల కరెంట్ ఇవ్వడంతోనే ఇది సాధ్యమైందన్నారు. అంతేకాదు, 2.40లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామనీ, ఇంకా 18 వేల ఉద్యోగాలపై కోర్టు కేసులు, వివిధ దశల్లో నియామకాలు జరుగుతాయని చెప్పారు. ఇప్పటికే 91 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చామనీ, ఇప్పటి నుంచి ఉద్యోగ క్యాలెండర్ పెట్టి రాష్ట్రంలో ఒక్క ఉద్యోగం ఖాళీ లేకుండా భర్తీ చేస్తామని సీఎం చెప్పారన్నారు. మానిఫెస్టోలో చెప్పినవన్నీ టీఆర్ఎస్ చేసి చూపిస్తున్నదనీ, బీజేపీ మాత్రం మాయమాటలు చెబుతూ ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. తెలంగాణలో పది వేల డబులు బెడ్ రూమ్ ఇండ్లు కట్టిన ఏకైక నాయకుడు పోచారం శ్రీనివాస్‌రెడ్డి అని తెలిపారు.