Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 10 శాతం కంటే అటవీశాతం తక్కువ ఉన్న జిల్లాలపై దృష్టి
- వారంలోగా యాక్షన్ ప్లాన్ రూపొందించాలి
- కలెక్టర్లను ఆదేశించిన సీఎస్ సోమేశ్‌కుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హరితహారంలో భాగంగా 19.50 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యమనీ, పది శాతం కంటే అటవీశాతం తక్కువ ఉన్న జిల్లాలపై దృష్టి సారించి వారంలోగా యాక్షన్‌ప్లాన్ సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్ నుంచి తెలంగాణకు హరితహారం, దళితబంధు, యాసంగి వరి ధాన్యం సేకరణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఎనిమిదో విడత తెలంగాణకు హరితహారం కార్యాచరణను ప్రకటించారు. ఏడు విడతల హరితహారంతో రాష్ట్రంలో 7.70 శాతం అటవీవిస్తీర్ణం పెరిగిందని గుర్తుచేశారు. అటవీ విస్తీర్ణం 10 శాతం కంటే తక్కువ ఉన్న జిల్లాల్లో పెద్ద ఎత్తున గ్రీనరీ పెంపొందించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ప్రకృతి వనాలు లేని గ్రామాల్లో వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి మండలంలోనూ కనీసం నాలుగు బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఉండాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పెంపు కోసం ప్రతి మున్సిపాలిటీకి ప్రణాళిక ఉండాలనీ, ఖాళీ స్థలాలను గుర్తించి, చిక్కటి పచ్చదనం పెంచటం లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున హరితహారం మొక్కలకు వారంలో రెండు, మూడు సార్లు నీటి వసతి కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల వద్ద, కాలువ గట్లపై పచ్చదనం పెంపు కోసం కృషి చేయాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో గుర్తించిన దళితబంధు లబ్దిదారుల యూనిట్లను వెంటనే గ్రౌండ్ చేయాలని ఆదేశించారు. వరి ధాన్యం సేకరణ గురించి ప్రస్తావిస్తూ, ఇప్పటికే ఏడు కోట్ల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయని, మరో 4.5 కోట్లు త్వరలో వస్తాయని ఆయన అన్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్లకు సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పీసీసీఎఫ్ డోబ్రిల్, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్,ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, హరితహారం ఓఎస్డి ప్రియాంక వర్గీస్, కలెక్టర్లు పాల్గొన్నారు.
మూడేండ్లలో ఐదు లక్షల ఎకరాల్లో అక్వాకల్చర్ అభివృద్ధికి బ్లూ ప్రింట్ రూపొందించండి : సీఎస్
రైతుల ఆదాయాన్ని మూడు, నాలుగు రెట్లు పెంచేలా రాబోయే మూడేండ్లలో ఐదు లక్షల ఎకరాలలో ఆక్వాకల్చర్‌ను అభివృద్ధి చేసేందుకు బ్లూప్రింట్ రూపొందించాలని సీఎస్ సోమేశ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. బీఆర్కెఆర్ భవన్లో ఆక్వాకల్చర్ పై మత్స్య, సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. కలెక్టర్ల ఆధ్వర్యంలోని జిల్లా స్థాయి కమిటీలు చొరవ తీసుకోవాలనీ, మొదటగా నిజామాబాద్ , నల్లగొండ, సూర్యపేట, ఖమ్మం, గద్వాల , కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలో ఆక్వాకల్చర్ క్లస్టర్లను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఫిషరీస్ కమిషనర్ లచ్చిరామ్ భూక్య, ఆ శాఖ సంయుక్త సంచాలకులు మురళీకృష్ణ, శ్రీనివాస్, నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సువర్ణ, స్పెషల్ కమిషనర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.