Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'మేడే' నిర్వహిద్దాం : సారంపల్లి, సాగర్ పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు సిద్ధం కావాలనీ, మేడే ఉత్సవాలను జయప్రదం చేయాలని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. సాగర్ పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్లోని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ అరిబండి ప్రసాదరావు, రాష్ట్ర సహాయ కార్యదర్శులు మూడ్ శోభన్, లెల్లెల బాలకష్ణతో కలిసి సారంపల్లి, సాగర్ విలేకర్లతో మాట్లాడారు. ప్రపంచకార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని మే ఒకటోతారీఖున మేడేను అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో ఏఐకెేఎస్ జెండాలు ఎగురవేయాలని పిలుపునిచ్చారు. కనీస మద్దతు ధరల చట్టం చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందనీ, అందుకోసం కమిటీని నియమిస్తామని చెప్పిందని గుర్తు చేశారు. రైతు సంఘాలే తమ ప్రతినిధుల పేర్లు ఇవ్వలేదంటూ కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్తోమర్ బుకాయిస్తున్నారని విమర్శించా రు. మోడీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల మీద ఆర్ధిక, సాంఘిక,మతోన్మాద దాడులను కొనసాగిస్తున్నదని చెప్పారు. విద్య, వైద్య, కార్మిక రంగాల్లో చట్టాలను మార్చేస్తున్నదని తెలిపారు. హక్కులను రక్షించుకునేందుకు పోరాడాల్సిన అవసరముందన్నారు. కార్మిక, కర్షక మైత్రిని చాటుతూ... రాష్ట్రంలోని కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలతో కలిపి మేడే ఉత్సవాలను నిర్వహించాలని కోరారు. రాష్ట్రంలో దాదాపు 16 లక్షల మంది కౌలు రైతులున్నారనీ, 2011 చట్టం ప్రకారం రుణ అర్హత కార్డుల ను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడంలేదనీ, అవి ఇవ్వకపోవడంతో వారు ఏ పథకాలకు నోచుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రుణసౌకర్యం, రుణమాఫీ, రైతుబీమా, పండిన పంటలను మార్కెట్లో అమ్ముకునే అవకాశం లేకుండాపోయిందన్నారు. రైతు ఆత్మహత్యల్లో దాదాపు సగానికిపైగా కౌలు రైతులే ఉన్నారని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం నిర్ధిష్టమైన కౌలు రేటు నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ఇష్టానుసారంగా కౌలు రేటు వసూళ్లు చేస్తున్న పరిస్థితి ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగిరాకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల మీద పోరాటాలు చేస్తామని వారు హెచ్చరించారు.