Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రత్యామ్నాయ విధానాలకు పోరాడుదాం
- మేడే వారోత్సవాలను విజయవంతం చేద్దాం : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ పిలుపు
నవతెలంగాణ-కంఠేశ్వర్
'బడా పెట్టుబడిదారులు వారి తాబేదార్లతో నడుస్తున్న పరిశ్రమల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహంతో కార్మికుల హక్కులను హరిస్తున్నాయనీ, కార్పొరేట్లకు లాభాలు కట్టబెడుతున్నాయనీ, ఈ విధానాన్ని కార్మికవర్గం ప్రతిఘటించాలనీ, ప్రత్యామ్నాయ విధానాలపై పోరాడుతూ ఐక్య ఉద్యమాలకు పునరంకిత మవుదామని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు. సంపద సృష్టికర్తలైన కార్మికులకు కొనుగోలు శక్తి లేకుండా చేస్తూ దేశ ఆర్థిక సార్వభౌమత్వాన్ని ధ్వంసం చేస్తున్నాయి. నిజామాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, నిర్మల్ జిల్లాల సీఐటీయూ వర్క్‌షాప్‌ను నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆ సంఘం కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ.. 1886 అమెరికాలోని చికాగో నగరంలో 8 గంటల పనిదినం అమలు కోసం, వెట్టిచాకిరీ విముక్తి, కనీస హక్కుల కోసం కార్మికులు సాగించిన వీరోచిత పోరాటంలో పోలీసులు జరిపిన మారణకాండలో ఆరుగురు కార్మిక నాయకులు అమరులయ్యారనీ, వేలమందికి తీవ్ర గాయాలయ్యాయని గుర్తుచేశారు. ఆ త్యాగాల సాక్షిగా ప్రపంచ కార్మికవర్గం నిర్వహించుకునే ఏకైక కార్మిక దినోత్సవం 'మేడే' అని తెలిపారు. ఈ చారిత్రాత్మక నేపథ్యంలో మేడే పండుగలా కాకుండా అంతర్జాతీయ పోరాట దినంగా చేసుకోవాలని సీఐటీయూ పిలుపునిచ్చిందన్నారు. కేంద్రంలోని మోడీ సర్కార్ కార్మిక చట్టాలకు తూట్లు పొడుస్తూ 8 గంటల పని విధానం రద్దు చేసి, వేతనాల పెంపుదలలో యూనియన్ల భాగస్వామ్యం లేకుండా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనియన్లు పెట్టుకునే హక్కు రద్దు, పని భద్రత వంటి మౌలిక హక్కులపై దాడి చేస్తున్నారని విమర్శించారు. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను అమల్లోకి తెచ్చిన కేంద్ర ప్రభుత్వాన్ని కార్మికవర్గం ప్రతిఘటించి పోరాడాలని తెలిపారు. మేడే అమరవీరుల స్ఫూర్తితో కార్మికులను ఐక్యం చేసి, ప్రత్యామ్నాయ విధానాలకై సమరశీల ఉద్యమాలకు కార్మికవర్గం పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మే 1 నుంచి 7వ తేదీ వరకు వారోత్సవంగా జరపాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ నిర్ణయించిందని వెల్లడించారు. ఫ్యాక్టరీ, గ్రామ, బస్తీ, పట్టణ, మండల కేంద్రాల్లో ర్యాలీలు, సభలు, ఆటలు, పాటల పోటీలు, కవి సమ్మేళనాలు, వివిధ కళా రూపాలతో మేడే శిబిరాలు నిర్వహించాలన్నారు. మేడే ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో జరిగే ఈ మేడే కార్యక్రమాల్లో కార్మికులు, కార్మిక కుటుంబాలతో సహా వేలాదిగా ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్వీ రమ, నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు రమేష్‌బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్, కామారెడ్డి కన్వీనర్ చంద్రశేఖర్, నిర్మల్ కార్యదర్శి సురేష్, ఆదిలాబాద్ కార్యదర్శి కిరణ్, తదితరులు పాల్గొన్నారు.