Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తప్పులు లేకుండా దరఖాస్తు చేసుకోండి : టీఎస్ఎల్పీఆర్బీ చైర్మెన్ విజ్ఞప్తి
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్రంలో ఏడు వేలకు పైగా పోలీసు శాఖతో పాటు వివిధ విభాగాల్లోని కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు సోమవారం నుంచి ఆన్లైన్ దరఖాస్తులను చేసుకోవడానికి రాష్ట్ర పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్పీఎల్ఆర్బీ) రంగం సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా బోర్డు అధికారిక వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.టీఎస్ఎల్పీఆర్బీ.ఇన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థులకు చైర్మెన్ వీవీ శ్రీనివాస్‌రావు విజ్ఞప్తి చేశారు. పోలీసు, ఎక్సైజ్, ఫైర్ సర్వీసులు, జైళ్లు, ఎస్పీఎఫ్, కమ్యూనికేషన్లు, రవాణా మొదలైన శాఖల్లో కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్, ఏఎస్ఐ పోస్టులు కలిపి ఏడువేలకు పైగా పోస్టులకు బోర్డు ఆరు నోటిఫికేషన్లను జారీ చేసిన విషయం తెలిసిందే. రెండో తేదీ ఉదయం ఎనిమిది గంటల నుంచి 20వ తేదీ రాత్రి పది గంటల వరకు దరఖాస్తు చేసుకోవడానికి వెబ్సైట్లో అవకాశం కల్పించామని చైర్మెన్ తెలిపారు. కాగా, దరఖాస్తు చేసుకొనే సమయంలో అందులో పొందుపర్చిన వివరాల ఆధారంగా కచ్చితమైన సమాచారాన్ని పొరపాట్లు దొర్లకుండా ఇవ్వాలని ఆయన సూచించారు. ఏదైనా పొరపాటు దొర్లితే అభ్యర్థి ఇబ్బందులు పడే అవకాశముందని ఆయన చెప్పారు. ఇక కానిస్టేబుల్ ఎస్సై ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మభ్యపెట్టి అభ్యర్థుల నుంచి డబ్బులు దోచుకొనే దళారుల పట్ల అప్రమత్తంగా మెదలాలని కూడా బోర్డు వర్గాలు హెచ్చరించాయి. ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల అర్హత, వారు చెల్లించాల్సిన ఫీజు, ఇతర అవసరమైన వివరాలను వెబ్సైట్లో సంపూర్ణంగా పొందుపర్చటం జరిగిందనీ, వాటిని అనుసరించి ముందుకు సాగాలని బోర్డు సూచించింది.