Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుంటాలలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత
- పది జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా ఎండలు
- గాలిలో తగ్గిన తేమ..
- వేడిగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మండుటెండలతో రాష్ట్రం నిప్పులకొలిమిలా మారింది. కుంటాల(కొమ్రంభీమ్ అసిపాఫాబాద్ జిల్లా)లో రాష్ట్రంలోనే అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. మొత్తంగా రాష్ట్రంలోని 33 జిల్లాలకుగానూ 10 జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే మూడురోజుల పాటు రాష్ట్రంలో వడగాల్పులు వీయనున్నాయి. వాటి ప్రభావం ఉత్తర తెలంగాణ జిల్లాలపై ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. జగిత్యాల, కుమ్రంభీమ్ అసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, సూర్యాపేట, నిజామాబాద్, కరీంనగర్, మహబూబాబాద్, నల్లగొండ, పెద్దపల్లి జిల్లాలు రెడ్ అలర్ట్ జోన్లో ఉన్నాయి. ఆయా జిల్లాల ప్రజలు ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలనీ, ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు బయట తిరగడం వీలైనంత మేరకు తగ్గించుకోవాలని సూచించింది. మిగతా జిల్లాల్లోనూ 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఓవైపు గాలిలో తేమ శాతం తగ్గడం, మరోవైపు వేడిగాలులు వీస్తుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇంట్లో ఫ్యాన్లు తిరుగుతున్నా భరించలేని వేడిమితో చిన్నపిల్లలు, వృద్ధులు ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు రాష్ట్రంలో అక్కడక్కడా తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన సంచాలకులు కె.నాగరత్న తెలిపారు. వచ్చే మూడ్రోజులు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగాల్పులు ఎక్కువగా వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
కుంటాల(కొమ్రంభీమ్ అసిఫాబాద్) 46 డిగ్రీలు
వాంకిడి(కొమ్రంభీమ్ అసిఫాబాద్) 46 డిగ్రీలు
ఎండపల్లి(జగిత్యాల) 45.9 డిగ్రీలు
కడెం పెద్దూరు(నిర్మల్) 45.9 డిగ్రీలు
కొల్వాయి(జగిత్యాల) 45.9 డిగ్రీలు
రాఘవపేట(జగిత్యాల) 45.9 డిగ్రీలు
మంథని(పెద్దపల్లి) 45.8 డిగ్రీలు
కెరమెరి(కొమ్రంభీమ్ అసిఫాబాద్) 45.8 డిగ్రీలు
రంజాల్(నిజామాబాద్) 45.8 డిగ్రీలు
లింగాపూర్(నిర్మల్) 45.8 డిగ్రీలు