Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్ నగరంలో వేర్వేరు మతాల యాత్రలకు వేర్వేరు విధాలుగా కాకుండా ఒకే తరహాలో అనుమతులు ఇచ్చే విధంగా మార్గదర్శకాలను రూపొందించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్నీ, డీజీపీని ఆదేశించింది. మత హక్కుల రక్షణ బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందని గుర్తు చేసింది. ఈనెల రెండు నుంచి 12 వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆది శంకరాచార్య జయంతి కార్యక్రమాలు, శోభాయాత్ర నిర్వహణకు, యాత్రలో మైకులను వాడేందుకు పోలీసులు అనుమతివ్వలేదంటూ దాఖలైన రిట్‌ను హైకోర్టు ఇటీవల విచారించింది. ఒక్కోసారి ఒక్కో తీరుగా అనుమతులు ఇచ్చే విధానం సరికాదని ఈ సందర్భంగా సూచించింది. అన్ని మతాల కార్యక్రమాలకు ఒకే తరహా అనుమతులు ఉండేలా మార్గదర్శకాలను తయారు చేసి జూన్ ఆరున జరిగే విచారణ సమయంలో నివేదించాలని డీజీపీని ఆదేశించింది. ఆదిశంకరాచార్య జయంతి, యాత్ర, మైక్ వినియోగానికి అనుమతించాలంటూ కోర్టు పోలీసులకు ఉత్తర్వులు జారీ చేసింది.
హిల్‌పోర్టు ప్యాలెస్ రక్షణ చర్యలు తీసుకోండి...
బషీర్‌బాగ్‌లో చారిత్రక హిల్ పోర్టు ప్యాలెస్‌ను రక్షించేందుకు వీలుగా ఇంజినీర్ల కమిటీ నివేదికకు అనుగుణంగా ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ హెరిటేజ్ ట్రస్ట్‌కు చెందిన దీపక్ కాంత్ గిర్ దాఖలు చేసిన పిల్‌ను చీఫ్ జస్టిస్ సతీష్‌చంద్రశర్మ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ విచారించింది. హిల్‌పోర్టు ప్యాలెస్‌ను పురురుద్ధరణ, పరిరక్షణ చర్యలు తీసుకుంటామన్న ప్రభుత్వ హామీని అమలు చేసి, నివేదికను ఆగస్టు 8న జరిగే విచారణ సమయంలో అందజేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.