Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహాకవికి తెలంగాణ సాహితి ఘన నివాళి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'శ్రీశ్రీని తలచుకోవాలంటే ప్రత్యేకించి ఓ సమయం, సందర్భం అక్కర్లేదు.. కాలే కడుపు, ఖాళీ జేబు ఆయన్ను ఎప్పుడూ గుర్తు చేస్తూనే ఉంటాయి' అని తెలంగాణ సాహితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఆనందాచారి అన్నారు.ఆ సంస్థ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై ఉన్న శ్రీశ్రీ విగ్రహానికి ఆయన జయంతి సందర్భంగా ప్రాచ్య కళాశాల పూర్వ ప్రధానాచార్యులు మోతుకూరు నరహరి, ఆనందాచారి పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మహా ప్రస్థానంతో మరో ప్రపంచపు మహా ద్వారాన్ని తట్టిలేపిన మహోగ్ర జ్వాల మన శ్రీశ్రీ అని చెప్పారు. తూటాల్లాంటి మాటలతో ఆకలి రాజ్యంపై రక్తాక్షరాలను చిందించిన గొప్ప మహాకవిని తెలిపారు. 'నేను సైతం ప్రపంచాగపు సమిధనొక్కటి ఆహుతిచ్చాను' అంటూ అడుగులేసిన శ్రీశ్రీ.. దారిపొడుగునా గుండె నెత్తురులు తర్పణ చేస్తూ.. ధరిత్రి నిండా నిండిన మరో ప్రపంచపు కణకణమండే త్రేతాగ్ని కోసం కదం తొక్కుతూ పదం పాడుతూ హృదాంతరాళాన్ని గర్జించాడ' అని తెలిపారు. కుక్కపిల్లలోనూ.. అగ్గిపుల్లలోనూ కవిత్వాన్ని చూసిన మహాకవి ఆయన అని అన్నారు. నేనొక దుర్గం.. నాదొక స్వర్గం.. అనర్గళం..అనితర సాధ్యం నా మార్గం అంటూ యవతకు దిశానిర్దేశం చేశారని తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహితి నాయకులు తంగిరాల చక్రవర్తి, సలీమ, అనంతోజు మోహన్ కృష్ణ, చంద్ర మోహన్ , జి నరేష్, శరత్ సుదర్శి తదితరులు పాల్గొన్నారు.