Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది
- రూ.కోట్లల్లో నష్టం
నవ తెలంగాణ - పటాన్చెరు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. పారిశ్రామికవాడలోని శ్రీ మోనాక్షి లైఫ్ సైన్సెస్ ప్రయివేట్ లిమిటెడ్ పరిశ్రమలో ప్రొడక్షన్ ప్లాంట్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సాల్వెంట్, డ్రమ్ములకు వ్యాపించడంతో కొన్ని డ్రమ్ములు గాలిలోకి ఎగిరి పేలాయి. చుట్టుపక్కల భయానక వాతావరణం నెలకొంది. ఈ పరిశ్రమలో పనిలో ఉన్న దాదాపు పది మంది కార్మికులు అప్రమత్తమై వెంటనే బయటకు పరిగెత్తడంతో ప్రాణ నష్టం తప్పింది. సమాచారం అందుకున్న పటాన్చెరు డీఎస్పీ భీమ్‌రెడ్డి, సీఐలు వేణుగోపాల్ రెడ్డి, వినాయక రెడ్డి, పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని బందోబస్తు ఏర్పాటు చేశారు. పటాన్చెరు ఫైర్ సిబ్బంది రెండు ఫైరింజన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేయగా.. అదుపులోకి రాలేదు. జిల్లా ఫైర్ శాఖ అధికారి శ్రీనివాస్ దగ్గరుండి పరిస్థితిని సమీక్షించి ఓడీఎఫ్, గుమ్మడిదల, సంగారెడ్డి, బీడిఎల్, సదాశివపేట్ తదితర ప్రాంతాల నుంచి ఏడు ఫైరింజన్లను రప్పించారు. మూడు గంటల పైనే శ్రమించి మంటలను అదుపు చేశారు. ప్రమాద తీవ్రతను బట్టి కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లే అవకాశం ఉందని, పరిశ్రమ యాజమాన్యం అందుబాటులోకి రాగానే నష్టాన్ని అంచనా వేస్తామని అధికారులు తెలిపారు.