Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రికి ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా పారామెడికల్ ఉద్యోగుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ కోరింది. శనివారం ఆ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంచాల రవీందర్ నేతృత్వంలో నాయకులు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావును కలిసి వినతిపత్రం సమర్పించారు. కోర్టుల్లో కేసులు పరిష్కారమైన నేపథ్యంలో ఇంకా జాప్యం చేయొద్దని వారు కోరారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, రేడియోగ్రాఫర్ల ఉద్యోగాల భర్తీకోసం 2017లో నోటిఫికేన్ ఇచ్చారని గుర్తుచేశారు. అయితే న్యాయవివాదాల కారణంగా ఐదేండ్లపాటు నియామక ప్రక్రియకు అంతరాయం కలిగిందని తెలిపారు. 1998లో రెగ్యులర్ రిక్రూట్ మెంట్ నియామకాల తర్వాత 21 ఏండ్ల కాలవ్యవధి తర్వాత వచ్చిన నోటిఫికేషన్ అనీ, ఆశావహులకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల సమస్యలను సావధానంగా విన్న మంత్రి, సాధ్యాసాధ్యాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం.రిజ్వీ, టీఎస్పీఎస్సీని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగార్థులు వేంకటపతి మిర్యాల, విజయ్ కుమార్, నరేష్, మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు.