Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మే 1 నుంచి 7 వరకు దరఖాస్తుల ఆహ్వానం
- బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మెన్ కేవీ రమణాచారి వెల్లడి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణ నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రభుత్వం తరఫున ఉచిత శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మెన్, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి చెప్పారు. శనివారంనాడిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్టడీ సర్కిళ్లనే దీనికోసం వినియోగిం చుకోవాలని నిర్ణయించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నందున పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే బ్రాహ్మణ నిరుద్యోగులకు ఈ శిక్షణ ఉపయుక్తంగా ఉంటుందన్నారు. గ్రూప్-1కు శిక్షణ పొందే బ్రాహ్మణ నిరుద్యోగులకు నెలకు రూ.5వేలు స్టైఫండ్, ఇతరులకు రూ.2వేలు చొప్పున ఇస్తామన్నారు. రూ.5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న బ్రాహ్మణ నిరుద్యోగ యువతీ, యువకులు మే 1 నుంచి 7వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. స్క్రీనింగ్ టెస్ట్ అనంతరం అభ్యర్ధుల ఎంపికను ఎస్ఎమ్ఎస్ ద్వారా తెలుపుతామన్నారు. మే 16వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు. ఇతర వివరాలు www.brahminparishad.telangana.gov.inద్వారా తెలుసుకోవచ్చు. దరఖాస్తుతో జతచేయాల్సిన డాక్యుమెంట్ల వివరాలు వెబ్సైట్లో ఉన్నాయనీ, నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ముఖ్య కార్యదర్శి బీ వెంకటేశం, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్య కార్యదర్శి వీ అనిల్‌కుమార్, అడ్మినిస్ట్రేటర్ యూ రఘురాం శర్మ తదితరులు పాల్గొన్నారు.