Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ.శాంతి కుమారి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణకు హరితహారం విజయవంతం చేసుకున్నట్టుగానే రాష్ట్రంలో రక్షిత అటవీ ప్రాంతాలు, టైగర్ రిజర్వులు, అభయారణ్యాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ. శాంతి కుమారి అన్నారు. అటవీ ప్రాంతాల రక్షణ, టైగర్ రిజర్వుల సమర్థ నిర్వహణ, ఎకో టూరిజం అభివృద్ధిపై సంబంధిత జిల్లాలకు చెందిన అటవీ అధికారుల ఒక రోజు వర్క్ షాప్ శనివారం హైదరాబాద్‌లోని అరణ్య భవన్లో జరిగింది. ఎకో టూరిజం పరంగా తెలంగాణలో చాలా చక్కని అవకాశాలున్నాయనీ, అందుబాటు వనరులను సద్వినియోగం చేసుకుంటూ వాటిని అభివృద్ధి చేయాలని సూచించారు. తెలంగాణకు హరితహారం విజయవంతం ద్వారా అటవీ శాఖ రోల్ మోడల్‌గా నిలిచిందనీ, అదే విధంగా టైగర్ రిజర్వులు, అభయారణ్యాలు, రక్షిత అటవీ ప్రాంతాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. తెలంగాణలో చెట్లు లేని రోడ్డు ఎక్కడా ఉండవద్దనే లక్ష్యంతో పనిచేయాలన్నారు. మిగతా రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి అడుగుపెట్టగానే హరితహారం ఫలితాలు కన్పిస్తున్నాయని ప్రతీ ఒక్కరూ ప్రశంసిస్తున్నారనీ, అదే స్ఫూర్తితో అటవీ ప్రాంతాల పునరుద్దరణ చేయాలని కోరారు. మండు వేసవిలో వన్యప్రాణుల రక్షణ సవాల్‌తో కూడుకున్నదనీ, అడవుల్లో ఉన్న సహజ నీటి కుంటలను కాపాడుతూనే, లేని ప్రాంతాల్లో కృత్రిమ నీటి వసతులు కల్పించాలని సూచించారు. అటవీ పునరుద్దరణ అనగానే ఇప్పుడు గజ్వేల్ గుర్తుకువస్తోందనీ, అలాగే మంచి నిర్వహణలో ఉన్న టైగర్ రిజర్వులు అనగానే అమ్రాబాద్, కవ్వాల్ పేరు చెప్పేలా పోటీ పడి పనిచేయాలని అధికారులు, సిబ్బందిని కోరారు.
ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. టైగర్ రిజర్వులు, అభయారణ్యాల్లో తాజా పరిస్థితులు, మరింత సమర్థవంగా నిర్వహణకు అవసరమైన అదనపు వనరులపై ప్రధాన అటవీ సంరక్షణ అధికారి (పీసీసీఎఫ్), అటవీ దళాల అధిపతి (హెచ్ఓఎఫ్ఎఫ్) ఆర్.ఎం. డోబ్రియాల్ సమీక్షించారు. ఒక్కో ప్రాంతం నిర్వహిస్తున్న అధికారులతో విభాగాల వారీగా చర్చించారు. అడవుల రక్షణకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం అద్భుతంగా ఉందనీ, పూర్తి స్థాయిలో బ్లాకుల వారీగా అటవీ పునరుద్దరణ, టైగర్ రిజర్వు ల్లో రక్షణ, గడ్డి మైదానాల పెంపు, నీటి వసతుల నిర్వహణ, పర్యావరణహిత ఎకో టూరిజం ప్రాంతాల గుర్తింపు- అభివృద్ధి జరగాలని సూచించారు. రక్షిత అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణ, చెట్ల నరికివేత, వన్య ప్రాణుల వేట పూర్తి స్థాయిలో అరికట్టడమే లక్ష్యంగా పనిచేయాలని సిబ్బందిని కోరారు.
సమావేశంలో పీసీసీఎఫ్ (కంపా) లోకేష్ జైస్వాల్, పీసీసీఎఫ్ (అడ్మిన్) స్వర్గం శ్రీనివాస్, అదనపు పీసీసీఎఫ్‌లు వినరు కుమార్, ఎంసీ పర్గెయిన్, ఏకే సిన్హా, అమ్రాబాద్, కవ్వాల్ ఫీల్డ్ డైరెక్టర్లు శ్రీనివాస్, వినోద్ కుమార్, అభయారణ్యాలకు చెందిన చీఫ్ కన్జర్వేట్లరు, జిల్లా అటవీ అధికారులు పాల్గొన్నారు.