Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నకిలీ విత్తన రహిత రాష్ట్రంగా చూడాలి
- విత్తన కొనుగోలుపై రైతులకు అవగాహన కల్పించాలి
- ఇతర ప్రాంతాల నుంచి నకిలీ సీడ్ రాకుండా పకడ్బందిగా ఏర్పాటులు :వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలో నాసిరకం విత్తన విక్రయాలను అడ్డుకోవాలని, తెలంగాణ రాష్ట్రాన్ని నకిలీ విత్తన రహిత రాష్ట్రంగా చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సంబంధిత అధికారులు, పోలీసు శాఖ అధికారులకు సూచించారు. నకిలీ విత్తనాలపై వివిధ జిల్లాల ఎస్పీలు, వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి నిరంజన్ రెడ్డి, హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రఘునందన్‌రావు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కోర్టు హాలు నుంచి శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నందున రాష్ట్రాన్ని నకిలీ విత్తన రహితంగా చేసేందుకు, వానాకాలం వ్యవసాయ ప్రణాళికలో నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టేందుకు అరికట్టేందుకు కృషి చేయాలన్నారు. నాణ్యమైన విత్తనాలు రైతులకు అందుబాటులో ఉండేలా చూడాలని చెప్పారు. నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి మోసపోకుండా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. రైతులు నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.
విత్తన కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించాలని సూచించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కల్తీ విత్తనాలు రాష్ట్రంలోకి రాకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. నకిలీ విత్తనాలు ఇతర రాష్ట్రాల నుంచి రాకుండా చెక్ పోస్టుల దగ్గర కట్టడి చేయాలని సూచించారు. విత్తన విక్రయ కేంద్రాలను మాత్రమే కాకుండా విత్తనాలను నిల్వ చేసే గోదాములను కూడా తనిఖీ చేయాలని, నకిలీ విత్తనాల నిల్వ ఉన్నట్టయితే గోదాములను సీజ్ చేయాలని చెప్పారు. విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు రైతు తప్పనిసరిగా రశీదు తీసుకోవాలని, విత్తనాలు కొనుగోలు చేసినట్టు రశీదుపై సంతకం చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ అధికారులు పోలీసు శాఖ అధికారులు పరస్పర సహకారంతో పని చేయాలని చెప్పారు.
హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. రైతులు నకిలీ విత్తనాలు కొన్ని మోసపోకుండా.. నకిలీ విత్తనాలను అరికట్టడంలో పోలీస్ అధికారులందరూ సమన్వయంతో పని చేస్తున్నారని తెలిపారు. వ్యవసాయ శాఖ, పోలీస్ శాఖ అధికారులు సమన్వయంతో పని చేసి రాష్ట్రంలో నకిలీ విత్తనాలు లేకుండా చేయాలని సూచించారు.
డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. నకిలీ విత్తన రహిత రాష్ట్రంగా చేయడంలో మనమందరం భాగస్వాములై లక్ష్యాన్ని నెరవేర్చాలన్నారు. పోలీస్ స్టేషన్ వారీగా షాపుల్లో తనిఖీలు నిర్వహించాలని చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ హనుమంతు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోరు కుమార్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, ఐజీ నాగిరెడ్డి, ఐజీ డీఎస్ చౌహాన్, అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ అనిల్ కుమార్, ఐజీపీ ఇంటెలిజెన్స్ రాజేష్, అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, సీడ్స్ ఎండీ కేశవులు, వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్ విజరు కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గీతారెడ్డి, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.