Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలు ఇప్పిస్తామని టోకరా
- రిమాండ్‌కు 8 మంది నిందితులు
- పరారీలో మరో ఐదుగురు : ఎస్పీ రెమా రాజేశ్వరి
నవతెలంగాణ-నల్లగొండ
వ్యవసాయ పరికరాలను సబ్సిడీపై ఇప్పిస్తామని రైతులకు కుచ్చుటోపీ పెట్టారు. నిందితుల్లో ఎనిమిది మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మాడుగులపల్లి మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన సింగం సైదులు తమకు వ్యవసాయ పరికరాలపై సబ్సిడీ ఇప్పిస్తానని నమ్మించి మోసం చేశాడని తిప్పర్తి మండలం ఇండ్లూర్ గ్రామానికి చెందిన బసవోజు నాగబ్రహ్మచారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనలా మరో ఎనిమిది మంది రైతుల నుంచి సుమారు రూ.8.80 లక్షల వరకు వసూలు చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు. దాంతో నల్లగొండ డీఎస్పీ, శాలిగౌరారం సీఐ పర్యవేక్షణలో దర్యాప్తు చేపట్టారు.
తిప్పర్తి మండల కేంద్రానికి చెందిన నూకల నాగరాజు ఉపాధి హామీ చట్టంలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో వాటర్ షెడ్ డిపార్ట్మెంట్లో 2012లో వాటర్ షెడ్ అసిస్టెంట్‌గా చేరాడు. సుమారు ఐదేండ్లపాటు తిప్పర్తిలోనే పని చేశాడు. అప్పట్లో ప్రభుత్వం పీఎస్ఐ స్కీమ్ ప్రకారం రైతులకు వ్యవసాయ పరికరాలపై 75 శాతం రాయితీ ఇచ్చింది. ఈ క్రమంలో నూకల నాగరాజు అప్పటి వాటర్ షెడ్ ప్రాజెక్టు ఆఫీసర్‌తో ఉన్న పరిచయంతో తిప్పర్తిలో కొంతమంది రైతులకు సబ్సిడీ కింద వ్యవసాయ పరికరాలు ఇప్పించి కమీషన్ తీసుకున్నాడు. 2018లో తెలంగాణ ప్రభుత్వం పీఎస్ఐ స్కీమ్‌ను ఎత్తేసింది. దాంతో వాటర్ షెడ్ డిపార్ట్మెంట్లో పని చేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ తొలగించారు. అయినా, నూకల నాగరాజు గతంలో పని చేసిన ఐడీ కార్డును చూపించి తిప్పర్తి మండల కేంద్రంతోపాటు చుట్టు పక్కల గ్రామాల్లో మార్కెట్ ధర కంటే సగానికే వ్యవసాయ పరికరాలు ఇప్పిస్తానని రైతులను నమ్మించాడు. కల్టీవేటర్‌కు రూ.9000, ట్రాక్టర్ పంప్‌కు రూ.11,000, రోటవేటర్‌కు రూ.35,000, ట్రాలీకి రూ.1,10,000, బేలర్కు రూ.1,45,000, ట్రాక్టర్ ఇంజన్‌కు రూ.3,50,000, కల్టీవేటర్ సెట్‌కు రూ.30,000, హాఫ్ వీల్స్‌కి రూ.9000, చిప్పలకు రూ.25,000, ఫుల్ వీల్స్‌కు రూ.18,000, త్రేస్సర్కు రూ.2,40,000 రూపాయల చొప్పున ధర నిర్ణయించి వసూలు చేశాడు. అలా రైతుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడానికి కొంతమంది ఏజెంట్లను నియమించుకున్నాడు. ఆ డబ్బులతో నల్లగొండ, మిర్యాలగూడలోని ఏజెన్సీల ద్వారా వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేసేవాడు. ఎవరైతే వ్యవసాయ పరికరాల కోసం ఇబ్బంది పెడతారో వాళ్లకు ముందుగా వాటిని ఇచ్చేవాడు. మిగతా వారికి రేపు మాపంటూ తప్పించుకు తిరిగారు. ఇలా సుమారు రెండు మూడేండ్ల నుంచి నూకల నాగరాజు అతని అనుచరులతో కలిసి 19 మండలాల్లోని 79 గ్రామాలకు చెందిన 498 మంది రైతులను రాయితీపై వ్యవసాయ పరికరాల పేరిట మోసం చేశాడు. నూకల నాగరాజు వద్ద సింగం సైదులు, ఉప్పునూతల నాగరాజు, కొండ సైదులు, బొదనపు మధుసూదన్‌రెడ్డి, బాత్క సైదులు, చింతకాయల సంతోష్, మరికొందరు కమీషన్ ఏజెంట్లుగా పనిచేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నారు.
ఈ కేసును త్వరితగతిన ఛేదించిన నల్లగొండ డీఎస్పీ జి.వెంకటేశ్వర్ రెడ్డి, శాలిగౌరారం సీఐ ఎస్.రాఘవరావు, టాస్క్‌ఫోర్స్ సీఐ రాజశేఖర్, తిప్పర్తి ఎస్ఐ యం.సత్యనారాయణతోపాటు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.