Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ -భువనగిరి
మే డే పోరాట స్ఫూర్తితో దేశంలో పెరుగుతున్న మతోన్మాద రాజకీయాలను అడ్డుకుందామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. శనివారం యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహా అధ్యక్షతన నిర్వహించిన ఆన్లైన్ బహిరంగ సభలో తమ్మినేని మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వచ్చి ఎనిమిదేండ్ల కాలంలో అశాంతి, మత విద్వేషాలు, కుల ఉన్మాదం, పౌరహక్కులపై దాడులు పెరిగాయని, ప్రజాస్వామ్య విలువలు నశించాయని చెప్పారు. డీ నాయకత్వంలో బీజేపీ వికృత చేష్టలు చేస్తోందన్నారు. కరోనా దెబ్బ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పేద, మధ్య తరగతి వర్గాలపై పెట్రోల్, డీజిల్ నిత్యావసర వస్తువుల ధరల భారం మోపారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వీసు రంగ సంస్థల ప్రయివేటీకరణ వేగంగా జరుగుతోందన్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే దేశం ఆర్థికంగా, సామాజికంగా ఘోరంగా దెబ్బతింటుందన్నారు. ఇప్పటికైనా ప్రగతిశీల శక్తులు, బీజేపీయేతర పక్షాలు, సమస్త కార్మిక వర్గం అంతా ప్రత్యక్ష పోరాటంలోకి వచ్చి రానున్న కాలంలో బీజేపీని గద్దె దించాలని పిలుపునిచ్చారు. మే డే స్ఫూర్తితో సీపీఐ(ఎం) శ్రేణులు ప్రజల్లోకి వెళ్లి బీజేపీ అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక, కార్మిక, విద్యార్థి, యువజన వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించి పోరాటాలకు సన్నద్ధం చేయాలని సూచించారు.
పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ.. ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న ఎనిమిది గంటల పని దినాన్ని.. నేడు బీజేపీ ప్రభుత్వం కాలరాసి 12 గంటల పని దినాలను అమల్లోకి తెచ్చి కార్మికుల హక్కులు హరించడాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్, రాష్ట్ర కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ, నాయకులు మాటూరు బాలరాజు, దాసరి పాండు, సిర్పంగి స్వామి, గడ్డం వెంకటేష్, వనం రాజు, ఈర్లపల్లి ముత్యాలు మరియు వడ్డేబోయిన వెంకటేష్ పాల్గొన్నారు.