Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం మాటలతో,
- నకిలీ విత్తనాలతో మోసపోయానని ఆవేదన
నవతెలంగాణ-సిరికొండ
రాష్ట్ర ప్రభుత్వం సూచించడంతో ఈసారి ఆరుతడి కింద పొద్దుతిరుగుడు పంట సాగు చేశానని, నకిలీ విత్తనాలు అంటగట్టడంతో మొలకెత్తక తీవ్రంగా నష్టపోయానంటూ.. ఓ యువ రైతు సెల్‌ఫోన్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది గ్రామంలో శనివారం జరిగింది. బాధిత రైతు బనావత్ జెతులాల్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆరుతడి పంటలు వేయాలని చెప్పడంతో తన భూమి మూడెకరాలతో పాటు మరో నాలుగెకరాలు కౌలుకు తీసుకొని పొద్దుతిరుగుడు సాగు చేశానన్నాడు. దుకాణాదారుడు నకిలీ విత్తనాలు అంటగట్టడంతో మొలకెత్తలేదని, దుకాణదారుడు మోసం చేశాడని, ఇటు ముఖ్యమంత్రీ మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేయాలని, లేకుంటే టవర్‌పై నుంచి దూకి చనిపోతానని రోదించాడు. తండా సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు అతన్ని సముదాయించారు. న్యాయం చేస్తామని హామీ పత్రం రాయించడంతో రైతు కిందకు దిగాడు.