Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెరిగిన 1500 మెగావాట్ల విద్యుత్ వినియోగం
- ప్రమాదాలను నివారించాలి: ఎన్పీడీసీఎల్ సీఎండీ అన్నమనేని గోపాల్‌రావు
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
కరెంటు బిల్లుల్లో లోడ్ పెరగడంతో వేస్తున్న డెవలప్మెంట్ చార్జీలను ఇంటి యజమానులే చెల్లించాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ అన్నమనేని గోపాల్‌రావు తెలిపారు. యాసంగి సీజన్లో నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్పిడిసిఎల్) పరిధిలో 1500 మెగావాట్ల విద్యుత్తు వినియోగం పెరిగిందని వివరించారు. విద్యుత్ భద్రతా వారోత్సవాల్లో భాగంగా మే 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు నిర్వహించే కార్యక్రమాలను వివరించడానికి శనివారం ఎన్పీడీసీఎల్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరెంటు బిల్లుల్లో లోడ్ పెరగడంతో వేస్తున్న డెవలప్మెంట్ చార్జీలను ఇంటి యజమానులే చెల్లించాలని సీఎండి గోపాల్‌రావు చెప్పారు. 500 వాట్స్ కెపాసిటీపై సర్వీసు తీసుకున్న అనంతరం ఏసీలు తదితర ఉపకరణలు ఏర్పాటు చేసుకోవడంతో లోడ్ పెరుగుతోందని, అందువల్లే డెవలప్మెంట్ చార్జీలు వేస్తున్నట్టు చెప్పారు.
విద్యుత్ ప్రమాదాల్లో మరణాలను నివారించాలన్నారు. 15-25 శాతం ప్రమాదాలు విద్యుత్తు శాఖాధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల జరుగుతుండగా, మిగతా తప్పిదాలు వినియోగ దారుల అవగాహనరాహిత్యంతో జరుగుతున్నా యన్నారు. వ్యవసాయ రంగంలో రైతులు పంపుసెట్లను వాడుతున్నప్పుడు మోటార్లను, పైపులను, ఫుట్ వాల్వులను ఏమరుపాటుతో తాకకూడదని సూచించారు. వ్యవసాయ పంపుసెట్లను, స్టార్టర్లను విధిగా ఎర్ట్ చేయాలని, ఎర్త్ చేయని పరికరాల వల్లే ప్రమాదాలు జరుగుతాయని వివరించారు. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద అనధికారికంగా ఫ్యూజులు మార్చడం, రిపేరు చేయడం, ఎబి స్విచ్‌లు ఆపరేట్ చేయడం, కాలిన తీగలను సరిచేయడం ప్రమాదకరమన్నారు. ఫేజ్ కన్వర్టర్ వాడటం నిషేధమని, శిక్షార్హమన్నారు. వ్యవసాయం, గృహాల్లో అతుకులు లేని సర్వీసు వైర్‌ను మాత్రమే వినియోగించాలన్నారు. వరికోతల సమయంలో హార్వెస్టర్లు పైకి వెళ్లినప్పుడు విద్యుత్ తీగలకు తగిలి ప్రమాదాలు జరిగే ప్రమాదముందన్నారు. సెల్‌ఫోన్ చార్జింగ్ పెట్టి తడి చేతులతో పట్టుకుని మాట్లాడటం వల్ల ప్రమాదం జరుగుతుందన్నారు. జంతువుల నుంచి పంటలను రక్షించుకునేందుకు విద్యుత్ తీగల ఫెన్సింగ్ వేస్తున్నారని, ఇది చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. వర్షాలు కురిసినప్పుడు తడిసిన విద్యుత్ స్తంభాల స్టేవైరు, సపోర్ట్ వైర్‌ను, తడిచిన విద్యుత్ ఉపకరణాలను తాకవద్దన్నారు. విద్యుత్ సంబంధిత సమస్యలను, ఫిర్యాదులను తెలియచేయడానికి టోల్ ఫ్రీ నెంబరు 1800 425 0028కు లేదా 1912కు ఫోన్ లేదా మెసేజ్ ద్వారా తెలపాలని వివరించారు.
కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల సమస్యలను సిజిఎం ఆపరేషన్ -1 ఫోన్ నెంబర్ 9490612390కు, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లి, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల సమస్యలను సిజిఎం ఆపరేషన్-2 ఫోన్ నెంబర్ 9491045991కు ఫిర్యాదు చేయాలని చెప్పారు.
ఈ సందర్భంగా భద్రతా వారోత్సవాలకు సంబంధించిన గోడపత్రిక, కరపత్రాలు, విద్యుత్ భద్రత సూత్రాలు తెలిపే పుస్తకాన్ని సిఎండి ఆవిష్క రించారు. విలేకరుల సమావేశంలో ఎన్పిడిసిఎల్ డైరెక్టర్లు పి.సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.