Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీవో 16 అమలు చేయాలి : ఎమ్మెల్సీ ఏ నర్పిరెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మరో ఉద్యమం రాకముందే కాంట్రాక్ట్ ఉద్యోగులు, లెక్చరర్ల క్రమబద్ధీకరణ జీవో 16ను అమలు చేయాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. జీవో నెంబర్ 16 సాధన కాంట్రాక్ట్ కార్మికుల పోరాటాలతోనే సాధ్యమైందన్నారు. దీనిపై కోర్టు తీర్పు కూడా వచ్చేసిందనీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేసి రెండు నెలలు కూడా గడిచిపోయిందనీ, అడ్డంకులు అన్నింటినీ అధిగమించినందున జీవో అమలు వేగాన్ని పెంచాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగులు, లెక్చరర్స్ క్రమబద్ధీకరణ జీవో 16 అమలు సాధన సమితి ఆధ్వర్యంలో కన్వీనర్ డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ అధ్యక్షతన ఆదివారంనాడిక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 'కాంట్రాక్ట్ ఉద్యోగులు, లెక్చరర్ల క్రమబద్ధీకరణ ప్రకటన మద్దతు సభ' జరిగింది. దీనికి ఎమ్మెల్సీ ఏ నర్సిరెడ్డి ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్రంలో 1.75 లక్షల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండగా ప్రభుత్వం ఇప్పుడు కేవలం 11,300 మందిని మాత్రమే రెగ్యులరైజ్ చేస్తామని ప్రకటించిందని గుర్తుచేశారు. దీన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. రెగ్యులర్ ఉద్యోగులు, టీచర్లతో కాంట్రాక్ట్ అధ్యాపకులు కలిసి ఉండాలనీ, అది మంచి సంప్రదాయమని అన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నాటికి అందరూ రెగ్యులర్ లెక్చరర్లుగా రావాలని ఆకాంక్షించారు. ఇంటర్, డిగ్రీ కళాశాలల్లోని ఖాళీలతో పోల్చితే రూల్ ఆఫ్ రిజర్వేషన్‌కు ఎలాంటి ఇబ్బందులు ఉండవని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రాథమిక విద్యాశాఖలో రకరకాల పేర్లతో అపాయింట్మెంట్స్ చేశారని చెప్పారు. కార్యక్రమంలో పాల్గొన్న సమితి సలహాదారులు ప్రొఫెసర్ జీ హరగోపాల్ మాట్లాడుతూ ప్రయివేటు, కార్పొరేట్ లాబీ చాలా విస్త్రుతమైందనీ, స్వలాభాల కోసం కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయోద్దని కోరుకుంటుందని అన్నారు. వారు రెగ్యులరైజ్ అయితే తమ కళాశాలల్లోని అధ్యాపకులకు జీతాలు పెంచాల్సి వస్తుందనే అడ్డుపుల్లలు వేస్తాయని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ టీచర్లు తమ విద్యావ్యవస్థలోని సాదకబాదకాలను విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో పంచుకోవాలనీ, ఆ బంధం భవిష్యత్ ఉద్యమాలకు ఉపయోగపడుతుందని దిశానిర్దేశం చేశారు. ద్వేష రాజకీయాలు వద్దనీ, ప్రేమించే రాజకీయాలే కావాలని అన్నారు. నిర్భంధ సమాజంలో భవిష్యత్ తరాల బతుకుల గురించి ఆలోచిస్తే భయం వేస్తుందని చెప్పారు. కులమతాలకు అతీతంగా నాగరికతను ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. మాజీ ఎమెల్సీ పీ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ పోరాడితే సమస్యలు పరిష్కారమవుతాయే తప్ప, పొగిడితే కావని చెప్పారు. జీవో 16 అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని అన్నారు. తమవంతు సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. సమితి సలహాదారులు డాక్టర్ అందె సత్యం, మాచర్ల రామకృష్ణగౌడ్, తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ నారాయణ, ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్ జాతీయ నాయకులు డాక్టర్ రత్నప్రభాకర్, సమితి కో కన్వీనర్లు డాక్టర్ పడాల జగన్నాధరావు, జీ రమణారెడ్డి, ఇ ఉదయశ్రీ, డాక్టర్ వస్కుల శ్రీనివాస్, కేపీ శోభన్‌బాబు, కే శైలజ, జీ ఉదయభాస్కర్, టీ నవీన్‌కుమార్, సీహెచ్ రాజిరెడ్డి తదితరులు మాట్లాడారు. తమ బాధల్ని 22ఏండ్లుగా అనేక ప్రభుత్వాలకు విన్నవించామనీ, పోరాటాలు చేశామని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వాటిని గుర్తించే జీవో నెంబర్ 16 విడుదల చేశారన్నారు. తక్షణం దాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.