Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎర్రజెండా నాయకత్వంలోనే
- ప్రత్యామ్నాయ విధానం
- కార్మిక సంక్షేమ నిర్మాణమే అభివృద్ధి
- ఎనిమిదేండ్లలో 80 వేల ఉద్యోగాలా?
- బీజేపీ గూటిలో కాలు పెట్టిన టీఆర్ఎస్
- కమ్యూనిస్టుల సూచనలను కేసీఆర్ నాలుక తిప్పి మాట్లాడుతున్నారు:
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
బీజేపీ, టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ సంఘటన అవసరమనీ, అది వామపక్ష సంఘటనతోనే సాధ్యమవుతుందనీ, ఆ లక్ష్యంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో కృషి జరుగుతుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కార్మిక, సంక్షేమ నిర్మాణంతోనే అభివృద్ధికి ఆస్కారం లభిస్తుందని వివరించారు. ఆదివారం ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను పురస్కరించుకొని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో బహిరంగసభ ఏర్పాటుచేశారు. ముందుగా ఇబ్రహీంపట్నం మార్కెట్ యార్డు నుంచి చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో కార్యకర్తల ఉత్సాహం మధ్య వారితో కలిసి తమ్మినేని చిందేశారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ.. బీజేపీ గూటిలో టీఆర్ఎస్ కాలు పెట్టిందన్నారు. రెండు పార్టీల విధానాలు ఒకేలా కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా విముక్తి పోరాటాలు నడుపుతున్నది ఎర్రజెండా మాత్రమేనన్నారు. ఎనిమిది గంటల పని విధానాన్ని సాధించుకున్న కార్మికులను మళ్లీ 12, 14 గంటల పని విధానంలోకి తీసుకువచ్చేందుకు మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు. కార్మికుల హక్కులను హరిస్తూ బానిసలుగా మార్చే విధానాలను తీసుకొస్తున్నారన్నారు. రైతులను నాశనం చేసే విధానాలను ముందుకు తెచ్చిందన్నారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించకపోవడం, వ్యవసాయ మార్కెట్లను రద్దు చేయడం లాంటి ప్రమాదకర విధానాలను తెచ్చేందుకు మోడీ ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సుమారు ఏడాది పాటు రాజీలేని పోరాటాలు నిర్వహించి 700 మంది రైతులు ప్రాణత్యాగం చేసి రైతు వ్యతిరేక చట్టాలను మోడీ చేత రద్దు చేయించిన ఘనత కమ్యూనిస్టులదే అన్నారు.
దళితులు, మైనారిటీ, క్రిస్టియన్లపై దాడులు కొనసాగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కులాలు, మతాల పేరుతో మనువాదాన్ని మళ్లీ తెరపైకి తెస్తున్నారని విమర్శించారు. వాక్ స్వాతంత్ర హక్కులను హరిస్తుందన్నారు. బీజేపీ అనుసరిస్తున్న విధానాలను కేసీఆర్ కొనసాగిస్తున్నారని తెలిపారు. కమ్యూనిస్టులతో జరిగిన చర్చలను కూడా కేసీఆర్ వక్రీకరించి మాట్లాడుతున్నారని విమర్శించారు. బంగారు తెలంగాణలో కేసీఆర్ హామీలు నీటి మూటలన్నారు. ఉద్యోగాల కల్పనలో వెనుకబడ్డారని తెలిపారు. మూడు లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నట్లు ప్రకటించి ఎనిమిదేండ్ల తర్వాత 80 వేల ఉద్యోగాలు వేస్తున్నామని ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కేసీఆర్ ఎందుకు అమలు చేయడం లేదన్నారు. ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలతోనే దేశానికి భవిష్యత్తు ఏర్పడుతుందని కమ్యూనిస్టులు కోరుకుంటున్నారన్నారు.బహిరంగసభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్ వెస్లీ, జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మధుసూదన్ రెడ్డి, సామెల్, పి.యాదయ్య, జగదీష్, మండల కార్యదర్శులు సీహెచ్ జంగయ్య, నర్సింహ, శ్యామ్సుందర్, ఇ నర్సింహ, ప్రజా సంఘాల నాయకులు కిషన్, రాంచందర్, జగన్, శ్రీనివాస్ రెడ్డి, అంజయ్య, ఆర్ జంగయ్య, నర్సింహ, సుమలత, రవికుమార్ ఉన్నారు.