Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమరుల స్ఫూర్తితో ఉద్యమిద్దాం
- బీజేపీ సర్కార్ కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడాలి
- మే డే ర్యాలీల్లో సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు సాయిబాబు, రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు కార్మికులను అణచి వేస్తున్న మోడీ సర్కార్
- బీజేపీని గద్దెదించితేనే రాజ్యాంగానికి రక్షణ
- ప్రత్యామ్నాయ రాజకీయ విధానాన్ని ప్రజలకు వివరించాలి : మేడే కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం హరిస్తున్నదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఎంబీ భవన్లో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మేడే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రజెండాను తమ్మినేని వీరభద్రం ఆవిష్కరించారు. 'వర్ధిల్లాలి మేడే, కార్మిక హక్కుల సాధనకు పోరాడతాం, వర్ధిల్లాలి ప్రజాపోరాటాలు, అప్అప్ సోషలిజం, డౌన్‌డౌన్ క్యాపిటలిజం, నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి'అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎనిమిది గంటల పనివిధానం కావాలంటూ కార్మికులు పోరాడారని గుర్తు చేశారు. ఆధునిక భారతదేశంలో 12, 14 గంటలు పనిచేస్తున్న పరిస్థితి ఉందన్నారు. దాని అమలుకు చట్టాలు తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయనీ, ఇది దారుణమని చెప్పారు. ఈ సమాజం ముందుకెళ్లాలనీ, కార్మికులు కొత్త హక్కులు సాధించుకోవాలని ఆకాంక్షించారు. పోరాడి సాధించుకున్న హక్కులను కాపాడుకునేందుకు పోరాటం చేయాల్సిన అవసరముందని పిలుపునిచ్చారు. మోడీ ప్రభుత్వ పాలన దేశభక్తులకు, అభివృద్ధి కాముకులకు కంటకప్రాయంగా మారిందన్నారు. మతోన్మాదాన్ని పెంచుతూ, దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెడుతున్నదని విమర్శించారు. కార్మికవర్గం, శ్రామికజనం, దేశభక్తులు మోడీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలనీ, బీజేపీని గద్దెదించాలని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఫాసిస్టు భావజాలాన్ని నిలువరించాలన్నారు. రాజ్యాంగాన్ని, అందులోని మౌలిక విలువలను నాశనం చేస్తున్నదని విమర్శించారు. లౌకిక ప్రజాస్వామ్యం, ఆర్థిక సార్వభౌమత్వం, సామాజిక న్యాయం, ఫెడరల్ వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని నొక్కిచెప్పారు. రాజ్యాంగాన్ని రద్దు చేసి మనువాదాన్ని రాజ్యాంగంగా అమలు జరపాలన్న కుట్ర బీజేపీ చేస్తున్నదనీ, దానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. బీజేపీని గద్దెదించితేనే దేశానికి, రాజ్యాంగానికి రక్షణ ఉంటుందన్నారు. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా కేసీఆర్ పాలన సాగుతున్నదని విమర్శించారు. ప్రజాసమస్యలపై నిరంతరం పోరాటాలు చేయాలని అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ను విమర్శించడం వరకే పరిమితం కాకుండా వామపక్షాలు చెప్తున్న ప్రత్యామ్నాయ రాజకీయ విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరముందన్నారు. విద్యావైద్యం, భూమి, ఉద్యోగం, వేతనం వంటి కనీస సౌకర్యాల కల్పనకు ఎర్రజెండా విధానాన్ని ముందుకుతీసుకుపోవాలని సూచించారు. వామపక్షాలను ఐక్యం చేయాలన్నారు. ప్రజాసంఘాల పోరాటాలను ఉధృతం చేయాలని అన్నారు. పార్టీ శ్రేణులన్నీ ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రతిజ్ఞ తీసుకోవాలని ఆయన చెప్పారు. సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు బి వెంకట్ మాట్లాడుతూ కార్మికులు, శ్రామికులు సంఘటితమై మేడే స్ఫూర్తితో హక్కుల సాధనకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఉపాధి, ఆహారం, భూమి, కూలి, అందరికీ ఇండ్లు, విద్యావైద్యం వంటి కనీస సౌకర్యాల కోసం ఉద్యమాలు నిర్మించాలన్నారు.
సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఎం సాయిబాబు మాట్లాడుతూ మతోన్మాదులు, కార్పొరేట్ల అపవిత్ర బంధానికి వ్యతిరేకంగా, ప్రజల మధ్య ఐక్యతను విచ్ఛిన్నం చేస్తున్న బీజేపీ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అధ్యక్షత వహించిన సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి జ్యోతి మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకుంటున్నదనీ, రాష్ట్రాలపైకి నెడుతున్నదని విమర్శించారు. మేడే స్ఫూర్తితో బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్‌వెస్లీ, టి సాగర్, రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్, ఆర్ శ్రీరాంనాయక్, ఎంవి రమణ, పి ఆశయ్య, టి స్కైలాబ్‌బాబు, బి ప్రసాద్, జె బాబురావు, సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, నంద్యాల నర్సింహ్మారెడ్డి, రఘుపాల్ తదితరులు పాల్గొన్నారు.