Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోరాడి సాధించుకున్న హక్కులకు భంగం: మేడే ఉత్సవాల్లో బి వెంకట్, సారంపల్లి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వ ఆధిపత్యం పెరిగిందనీ, దీంతో రాష్ట్రాల హక్కులు హరించబడుతున్నాయని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యాలయం ముందు మేడే సందర్భంగా అరుణపతాకాన్ని ఎగురవేశారు. అనంతరం సంఘం ఉపాధ్యక్షులు బి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వెంకట్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలపై కూడా కేంద్రం ఆంక్షలు విధిస్తున్నదని చెప్పారు. తద్వారా రాష్ట్రానికి రావాల్సిన నిధులకు కోత పెడుతున్నదని తెలిపారు. ఒక్క మాటలో చెప్పాలంటే కార్మికులు, కర్షకులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తున్నదని విమర్శించారు. పెట్టుబడి దారుల ప్రయోజనాలకు అనుగుణంగా..కార్మికుల శ్రమను దోచిపెట్టేందుకు మోడీ సర్కార్ విధానాలను రూపొందిస్తున్నదని తెలిపారు. పేద వ్యవసాయ కార్మికులకు బుక్కెడన్నం పెడుతున్న ఉపాధి హామీ చట్టాన్ని లేకుండా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి రైతు సంఘం కార్యాలయం ముందు అరుణ పతాకాన్ని ఎగురేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మోడీ సర్కారు ఉన్న చట్టాలను మార్చి, ప్రజాస్వామిక విలువలకు తిలోదకాలిస్తున్నదని చెప్పారు. రైతాంగ ఉద్యమ స్ఫూర్తితో కార్మికులు సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరల చట్టాన్ని ఎందుకు అమలు చేయటంలేదో చెప్పాలని ప్రశ్నించారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు బి పద్మ, రైతు సంఘం నాయకురాలు సారంపల్లి భాగ్యలక్ష్మి, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్‌బాబు, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, వ్యకాస, రైతు సంఘాల నాయకులు ఆంజనేయులు, శోభన్‌నాయక్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.