Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.రాజారావు
- సీఐటీయూ రాష్ట్ర కార్యాలయం వద్ద అరుణపతాకం ఎగురవేత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పురాణగాథస్థాయికి దిగజార్చి మేడే విశిష్టతను అపహాస్యం చేసే కుట్రకు కేంద్రంలోని నేటి పాలకులు పూనుకుంటున్నారని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.రాజారావు విమర్శించారు. విశ్వకర్మ దినోత్సవాన్ని కార్మికవర్గ దినోత్సవం జరపాలని చూడటం దారుణమన్నారు. ఆదివారం హైదరాబాద్లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయం వద్ద ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన అరుణపతాకాన్ని ఎగురవేశారు. మేడే అమరవీరుల చిత్రపటానికి సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా రాజారావు మాట్లాడుతూ.. అమరుల త్యాగాలతో సాధించుకున్న ఎనిమిది గంటల పనిధానాన్ని, కార్మికుల హక్కులను మన దేశంలో మతతత్వ పాలక వర్గం దేశాన్ని పెట్టుబడిదారులకు తాకట్టుపెడుతున్నదని విమర్శించారు. కులం, మతం, ప్రాంతీయ తత్వాలను ముందుకు తెచ్చి కార్మికులను ఐక్యం కాకుండా చేసి శ్రమశక్తి కారుచౌకగా కొట్టేసే దుర్మార్గపూరిత చర్యకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దిగిందన్నారు. తాము కులాలు, మతాలు పాటించమనీ, మనుషులంతా ఒక్కటేనన్న చైతన్యాన్ని కార్మికులకు కల్పించాల్సిన ఆవశ్యకత సీఐటీయూపై ఉందని నొక్కి చెప్పారు. సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు మాట్లాడుతూ..మే ఒకటో తేదీ నుంచి 30 తేదీ వరకూ వర్గ ఐక్యతను సాధించాలనే పిలుపును తమ కేంద్ర కమిటీ ఇచ్చిందన్నారు. కార్మిక, ప్రజా సాంస్కృతిక ఉద్యమంగా వారం పాటు రాష్ట్రంలో మేడే ఉత్సవాలను నిర్వహించాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించిందన్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను, దేశ సంపదను విదేశీ, స్వదేశీ పెట్టుబడులకు ధారాదత్తం చేస్తున్నదని విమర్శించారు. నేషనల్ మానిటైజేషన్ పైపులైన్ ద్వారా లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను కారుచౌకగా అమ్మేసే కుట్రకు పూనుకున్నదనీ, దీన్ని దేశ ప్రజలంతా ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కరోనా సమయంలో ప్రభుత్వ రంగ వైద్య వ్యవస్థ ఉంది కాబట్టే లక్షలమంది ప్రాణాలను కాపాడుకోగలిగామనీ, పెట్టుబడిదారీ దేశాల్లో ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలి లక్షలు సంఖ్యలో ప్రజలు చనిపోయారని వివరించారు. చైనా, క్యూబా, వియత్నాం దేశాలలో ప్రజారోగ్యవ్యవస్థ మెరుగ్గా ఉండటంతో కరోనా కట్టడిలో ఆ దేశాలు విజయవంతమైన విషయాన్ని గుర్తుచేశారు. వ్యవస్థమారాలనీ, సమసమాజం రావాలనే లక్ష్యంతో సీఐటీయూ పనిచేస్తున్నదని చెప్పారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్వీ రమ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వృత్తిదారుల సమన్వయ కమిటీ కన్వీనర్ ఎంవీ రమణ, రజకవృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.ఆశయ్య, గొర్రెలు, మేకల పెంపకం దాఉల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు వీఎస్రావు, రాష్ట్ర కమిటీ సభ్యులు సీహెచ్ రోజారాణి, యాటల సోమన్న, ఎ.సునీత, ఐద్వా నాయకులు స్వర్ణ, తదితరులు పాల్గొన్నారు.