Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థి సస్పెన్షన్
నవతెలంగాణ-సత్తుపల్లి
ఇంజనీరింగ్ విద్యార్థులు కళాశాల ఎంట్రన్స్ ఎదుట రోడ్డు మీద కర్రలతో, రాళ్లతో వీధి రౌడీల్లా ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం కలకలం రేపింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారంలో గల సాయిస్ఫూర్తి ఇంజినీరింగ్ కళాశాలలో మొదట, రెండవ సంవత్సరం విద్యార్థుల మధ్య శనివారం సాయంత్రం జరగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. జూనియర్ విద్యార్థులు పార్టీ చేసుకొనేందుకు కాలేజీ ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశానికి వెళ్లారు. అక్కడ ముందుగానే సీనియర్ విద్యార్థులు పార్టీ చేసుకుంటున్నారు. సీనియర్స్ల లో ఒకరిని జూనియర్ సిగరేట్ అడగ్గా.. ఇచ్చిన సీనియర్.. జూనియర్‌ను ఏం చదువుతున్నావని అడిగాడు. దాంతో జూనియర్.. తొమ్మిదో తరగతి అంటూ ఎగతాళిగా కించపరిచేలా చెప్పడంతో సీనియర్ కోపంతో వారి మధ్య మాటామాటా పెరిగింది. అది ఇద్దరి మధ్య గొడవకు దారి తీసింది. అది కాస్తా జూనియర్, సీనియర్ల మధ్య గొడవగా మారి కర్రలు, రాళ్లతో ఒకరినొకరు గాయపరచుకునే వరకూ వెళ్లింది. అలా గొడవపడుతూ కాలేజీ ఎదుటి వరకు వచ్చి అక్కడా పరస్పరం దూషణలు, కర్రలు, రాళ్లతో దాడులూ చేసుకున్నారు. దాంతో జాతీయ రహదారిపై ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘర్షణ నేపధ్యంలో ఒక విద్యార్థిని సస్పెండ్ చేశామని మిగిలిన విద్యార్థులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇస్తున్నామని కళాశాల యాజమాన్యం తెలిపారు. రాబోయే రోజుల్లో కాలేజీలో ఇలాంటి గొడవలు జరగకుండా చూస్తామన్నారు.