Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి
- మే డే సందర్భంగా రవీంద్ర భారతిలో
- శ్రమశక్తి అవార్డుల ప్రదానోత్సవం
- మంత్రులు మహమూద్ అలీ, తలసాని హాజరు
నవతెలంగాణ-కల్చరల్
కార్మిక శ్రేయస్సే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం అని, కార్మికులను ధనవంతులుగా తీర్చిదిద్దుతామని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని (మేడే) పురస్కరించుకుని హైదరాబాద్లోని రవీంద్రభారతిలో కార్మికశాఖ ఆధ్వర్యంలో 'శ్రమశక్తి' అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడారు. కరోనా కాలంలో కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. తెలంగాణ అంటేనే కార్మికుల అడ్డా అని, ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది కార్మికులు తెలంగాణకు వలస వస్తున్నారని తెలిపారు. బంగారు తెలంగాణ రాష్ట్రం కార్మికుల కోసం అనేక అవకాశాలు, సౌకర్యాలు కల్పిస్తోందని చెప్పారు. హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కార్మికుల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని వివరించారు. కరోనా సమయంలో తెలంగాణ కార్మికులకు అండగా నిలిచి ఆదుకున్నదని గుర్తు చేశారు. రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. శ్రమ దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా, హక్కులకోసం పోరాటం జరిగిందని మేడే విశిష్టతను తెలిపారు. అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కార్మికులు లేకపోతే ప్రపంచమే లేదన్నారు. అనంతరం కార్మికులకు శ్రమశక్తి అవార్డులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో కార్మిక ఉపాధి శిక్షణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాణి కుముదిని, కార్మిక శాఖ కమిషనర్ అహ్మద్ నదీమ్, తదితరులు పాల్గొన్నారు.