Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రవ్యాప్తంగా సెగలుగక్కుతున్న ఎండలు
- 16 జిల్లాల్లో 45 డిగ్రీలకుపై ఉష్ణోగ్రతలు
- వేడిగాలులతో బయటకెళ్లలేని పరిస్థితి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. భానుడి భగభగతో రాష్ట్రవ్యాప్తంగా సెగలు గక్కేలా ఎండలు కొడుతున్నాయి. 16 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకుపైగా నమోదయ్యాయి. దీనికితోడు వేడిగాలులు వీస్తున్నాయి. కాసేపు ఎండలో బయటికెళ్తే తల దిమ్మదిరిగిపోతున్న పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం టీఎస్డీపీఎస్ ద్వారా విడుదల చేసే బులిటెన్లోనే ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. పెద్దపల్లి జిల్లా మంథనిలో అత్యధికంగా 45.8 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత రికార్డయింది. జీహెచ్ఎంసీ పరిధిలోని ఎల్బీనగర్ జోన్లో అత్యధికంగా 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వాస్తవానికి, క్షేత్రస్తాయిలో అంతకంటే ఎక్కువే ఎండలు కొడుతున్నాయనే భావన కలుగుతున్నది. రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన సంచాలకులు కె.నాగరత్న తెలిపారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కొమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలపై వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపారు. అదే సమయంలో రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశముందనీ, కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కూడా పడొచ్చని పేర్కొన్నారు.
మంథని(పెద్దపల్లి) 45.8 డిగ్రీలు
ఎండపల్లి(జగిత్యాల) 45.7 డిగ్రీలు
పమ్మీ(ఖమ్మం) 45.6 డిగ్రీలు
చెల్పూరు(జయశంకర్ భూపాలపల్లి) 45.6 డిగ్రీలు
మారేడుపల్లి(పెద్దపల్లి) 45.6 డిగ్రీలు
కెరమెరి(కొమ్రంభీమ్ అసిఫాబాద్) 45.6 డిగ్రీలు
దామరచర్ల(నల్లగొండ) 45.5 డిగ్రీలు
జైనధ్(ఆదిలాబాద్) 45.5 డిగ్రీలు
రాయినిగూడెం(సూర్యాపేట) 45.4 డిగ్రీలు