Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కౌలు రైతు ఆత్మహత్య
నవతెలంగాణ-ఇల్లందకుంట
చీడ పీడలతో పంట నష్టపోయి దిగుబడి తగ్గడంతో పెట్టుబడికి చేసిన అప్పులు ఎలా తీర్చాలోనన్న మనస్తాపంతో ఓ కౌలు రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సీతంపేట గ్రామంలో ఆదివారం ఉదయం జరిగింది. ఇల్లందకుంట ఎస్ఐ తోట తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తిప్పరవేణి రాజు (33) అదే గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద పాలేరు పని చేసుకుంటూ మూడెకరాలు కౌలు తీసుకుని సాగు చేస్తున్నాడు. ఖరీఫ్‌లో పత్తి, మిరప పంట వేయగా చీడతో పంట దెబ్బ తిని పెట్టుబడి కూడా రాలేదు. దాంతో తెచ్చిన అప్పులు సుమారు రూ.3లక్షల వరకు అవడంతో ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనస్తాపం చెందాడు. శనివారం సాయంత్రం కౌలు భూమి వద్దకు వెళ్లి గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. చుట్టుపక్కల రైతులు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, జమ్మికుంటలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచనల మేరకు వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆదివారం తెల్లవారుజామున రాజు మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.