Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చేనేతకు కేంద్రం ఏం చేసిందో చెప్పండి
- బీజేపీ అసమర్ధతవల్ల టెక్స్టైల్ రంగం ఆగం :
- బండి సంజయ్‌కి మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
చేనేత కార్మికుల సంక్షేమంపై శనివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు చేసిన మాటలు ఆయన అజ్ఞానాన్ని, అమాయకత్వాన్ని, మూర్ఖత్వాన్ని చాటేలా ఉన్నాయని మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. చేనేత కార్మికుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం చేసిందేందో చెప్పాలని ఈ మేరకు ఆదివారం మంత్రి కేటీఆర్ బండి సంజరుకు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో సబ్బండ వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం తగిన కార్యక్రమాలను చేపట్టి దేశానికి మార్గదర్శిగా నిలుస్తున్నదని తెలిపారు. ఇదే కోవలో దశాబ్దాలుగా నేతన్నల సంక్షేమం కోసం దేశంలో ఏ రాష్ట్రం, ప్రభుత్వం చేపట్టని స్థాయిలో విప్లవాత్మకమైన కార్యక్రమాలను సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిందని పేర్కొన్నారు.
నేతన్నల సంక్షేమంపై మొసలి కన్నీరు కార్చిన గత ప్రభుత్వాలకు భిన్నంగా, వందల కోట్ల రూపాయలను ఒకేసారి బడ్జెట్లో కేటాయించి వారి సంక్షేమానికి సరి కొత్త అర్థాన్నిచ్చామని తెలిపారు. రుణాలను మాఫీ చేసి, వారిని అప్పుల ఊబినుంచి కాపాడింది రాష్ట్ర ప్రభుత్వమేనని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా చేనేత కార్మికులకు 40 శాతం సబ్సిడీ ఇస్తున్న 'చేనేత మిత్ర' తెలంగాణలో ఉన్నదని తెలిపారు. నేతన్నకు చేయూత పేరుతో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పొదుపు పథకము కోవిడ్ సంక్షోభ కాలంలో ఒక ఆపన్నహస్తంగా మారిందని తెలిపారు. మగ్గాల అధునీకరీరణ నుంచి 'వర్కర్ టూ ఒనర్' పథకం వరకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాల వలన నేతన్నల ఆదాయం పెెరింగిందనీ, వారు గౌరవంగా తమకాళ్లపై తాము నిలబడే పరిస్థితి తీసుకు రాగలిగామని వివరించారు. కేవలం నేతన్నలనే కాకుండా స్థూలంగా టెక్స్ టైల్ పరిశ్రమను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ది చేసేందుకు దేశంలోనే అతిపెద్దదైన కాకతీయ టెక్స్ టైల్ పార్కు మొదలుకుని అనేక మౌళిక వసతులను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. చేనేతతోపాటు పవర్లూమ్ నేతన్నలకు కూడా పెద్ద ఎత్తున సహాయం అందించామని తెలిపారు. ఒకప్పుడు ఉరికొయ్యలకు వేలాడిన నేతన్నల శవాల సాక్షిగా, రాజకీయాలు చేసిన పార్టీల సంస్కృతిని, తిరిగి బండి సంజరు తీసుకురావాలనుకుంటున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నేతన్నల సంక్షేమం కోసం చేస్తున్న కృషిని పట్టించుకోకుండా, నేతన్నలను మోసపుచ్చే కల్లబొల్లి మాటలు వల్లె వేస్తున్నారని పేర్కొన్నారు. వారి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ చేస్తున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. ఇప్పటికే అనేక సార్లు కేంద్రమంత్రులను, ప్రధాన మంత్రిని సైతం కలిశామని తెలిపారు. కాకతీయ మెగా టెక్స్ెటైల్ పార్కుకి ప్రత్యేక ఆర్థిక సహాయం అందించాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని కేంద్రం పక్కన పెట్టిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో నేషనల్ టెక్స్ టైల్ రిసెర్చ్ ఇన్ట్సిట్యూట్ ఏర్పాటు, చేనేతల కోసం ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ హ్యాండ్ లూమ్ టెక్నాలజీ, మెగాపవర్ లూమ్ క్లస్టర్ ను ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను కేంద్రం పట్టించుకోవడం లేదని తెలిపారు. మరోవైపు ప్రజలపై తన అబద్ధాలతో దండయాత్ర చేస్తున్న బండి సంజరు, తన కపట పాదయాత్రలో తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారనీ, అధికారంలోకి వచ్చిన తర్వాత నేతన్నల కోసం అనేక కార్యక్రమాలు చేపడతామని మాట్లాడుతున్న బండి సంజరు.. కేంద్రంలో అధికారంలో ఉన్న విషయాన్ని మర్చిపోయి అవకాశవాదంగా మాట్లాడుతున్నాడని విమర్శించారు. నేతన్నకున్న అన్ని బీమా పథకాలను కేంద్ర ప్రభుత్వం రద్దుచేస్తే రాష్ట్ర ప్రభుత్వం వారికి బీమా కల్పిస్తున్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. మొసలి కన్నీరు కార్చడం మానుకోవాలని హితవు పలికారు.