Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంహెచ్ భవన్ మే డే కార్యక్రమంలో : ఎడిటర్ ఆర్.సుధాభాస్కర్
నవతెలంగాణ-సిటీబ్యూరో
కార్మిక హక్కుల కోసం జరిగే ప్రతి పోరాటాన్ని నవతెలంగాణ కవర్ చేస్తోందని, కార్మిక పోరాటాలు, ఉద్యమాలకు నవతెలంగాణ అద్దంలా పనిచేస్తోందని ఎడిటర్ ఆర్.సుధాభాస్కర్ అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఎంహెచ్భవన్ (నవతెలంగాణ కార్యాలయం)లో నిర్వహించిన మే డే ఉత్సవాల్లో పత్రిక సీనియర్ ఉద్యోగి నర్సింగ్‌రావు జెండా ఆవిష్కరించారు. అనంతరం జనరల్ మేనేజర్ సుబ్బారావు అధ్యక్షతన నిర్వహించిన సభలో సుధాభాస్కర్ మాట్లాడారు. ఇంగ్లాండ్‌లో చార్టర్ ఉద్యమం, సార్వత్రిక ఓటు హక్కు, 8గంటల పనివిధానంపై ఉద్యమాలు, పోరాటాల గురించి వివరించారు. కార్మికులు 1926లో ట్రేడ్ యూని యన్ పెట్టుకునే హక్కు సాధించుకున్నారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిపాటు రైతులు ఎండ, వాన, చలికి తట్టుకుని వీరోచితంగా పోరాడి హక్కులను సాధించుకున్నారని తెలిపారు. ట్రక్కులతో తొక్కించినా ఉద్యమాన్ని ఆపలేదని, రైతుల దెబ్బకు మోడీ ప్రభుత్వం దిగొచ్చి రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందని గుర్తుచేశారు. కరోనా కాలంలో భారతదేశానికి రూ.78 లక్షల కోట్ల నష్టం వచ్చినట్టు ఆర్బీఐ చెప్పిందన్నారు. దేశంలో ఉపాధి కల్పనపై పెట్టుబడి పెట్టకపోతే ఆర్థిక సంక్షోభం తప్పదని ఐఎంఎఫ్ హెచ్చరించిందని గుర్తుచేశారు. దేశంలో పెట్రోలు, డీజిల్, గ్యాస్, నిత్యావసర ధరల ను నియంత్రించడంలో మోడీ ప్రభుత్వం విఫలమైం దని, పైగా మతం, కులాల పేరుతో ప్రజలు, కార్మికులను నిలువున చీల్చడానికి బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని విమర్శించారు. కార్మికులను ఏకం చేయడంతోపాటు వర్గ పోరాటాలకు ప్రజలను ఐక్యం చేయడానికి నవతెలంగాణ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అసిస్టెంట్ ఎడిటర్ కె.ఆనందాచారి మాట్లాడుతూ.. అంతర్జాతీయ కార్మిక దినోత్సవంతో పాటు దక్షిణభారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత సుందరయ్య పుట్టినరోజు కావడం ఆనందంగా ఉందన్నారు. పెట్టుబడిదారులే సంపద సృష్టికర్తలని కేంద్ర ప్రభుత్వం చెబుతుందని, కార్మికులు, కష్టజీవులే సంపద సృష్టికర్తలని కాపిటల్‌లో కారల్ మార్క్స్ చెప్పారని గుర్తుచేశారు. బీజేపీ ప్రభుత్వం కులాలు, మతాల పేరుతో విభజన సృష్టిస్తుంటే పెట్టుబడిదారులు, కార్పొరేట్ శక్తులు ప్రజలను ఆర్థికంగా దోచుకుం టున్నారని అన్నారు. నవతెలంగాణ సీజీఎం పి.ప్రభాకర్ మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలోనూ సంస్థ అభివృద్ధికి ఉద్యోగులు కష్టపడి పనిచేశారని అన్నారు. ఎన్ని అడ్డంకులొచ్చినా పత్రిక దినదినాభివృద్ధి చెందుతోందన్నారు. హైదరాబాద్ రీజియన్ జనరల్ మేనేజర్ ఆర్.వాసు వందన సమర్పణ చేశారు.
సరుకులు పంపిణీ
మే డే సందర్భంగా నవతెలంగాణ ఉద్యోగులకు సరుకులు పంపిణీ చేశారు. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కొలను నీలాగోపాల్‌రెడ్డి సహకారంతో 200 మందికి ఒక్కొక్కరికి 5కిలోల గోధుమ పిండి ప్యాకెట్లను అందజేశారు. అలాగే, అభినయ ట్రస్టు చైర్మెన్ గజ్జె శ్రీనివాస్‌రావు సహకారంతో మౌత్ వాష్, ఎయిర్ కండిషనర్ అందజేశారు. ఆ ప్యాకెట్లను నవతెలంగాణ ఎడిటర్ ఆర్.సుధాభాస్కర్, సీజీఎం పి.ప్రభాకర్, జనరల్ మేనేజర్ సుబ్బారావు, ఆర్.వాసు చేతుల మీదుగా పంపిణీ చేశారు.