Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలిరోజు 3,895 అప్లికేషన్లు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో గ్రూప్-1 పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది. మొదటి రోజు సాయంత్రం ఐదు గంటల నాటికి 3,895 అప్లికేషన్లొచ్చాయి. గతనెల 26వ తేదీన 503 పోస్టుల భర్తీకి తెలంగాణ తొలి గ్రూప్-1 నోటిఫికేషన్‌ను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కమిషన్ తొలిసారిగా అభ్యర్థుల నుంచి అభిప్రాయాలు స్వీకరించే ప్రత్యేక పద్ధతికి శ్రీకారం చుట్టిందని వివరించారు. తొలిరోజు దరఖాస్తు చేసిన వారిలో ర్యాండమ్‌గా పది మందిని గురించి వారి మొబైల్ ఫోన్ ద్వారా సంప్రదించామని తెలిపారు. ఓటీఆర్ అప్డేట్ చేయడం, గ్రూప్-1కు ఆన్లైన్లో దరఖాస్తు చేయడంలో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా ?వంటి వాటిపై సమాచారం అడిగామని పేర్కొన్నారు. ఈ ప్రత్యేక పద్ధతిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. ఎలాంటి సమస్యల్లేవంటూ ఆయా అభ్యర్థులు అభిప్రాయపడ్డారని వివరించారు. టీఎస్పీఎస్సీ వెబ్‌సైట్‌ను సంప్రదించడం ఓటీఆర్, ఆన్లైన్ దరఖాస్తులను నింపడం వంటి ప్రక్రియ సులభంగానే ఉందని వారి అభిప్రాయపడ్డారని పేర్కొన్నారు. సాంకేతికంగా ఏమైనా అవాంతరాలుంటే ఐదు నుంచి ఎనిమిది నిమిషాల్లో పరిష్కరిస్తామని తెలిపారు. గ్రూప్-1 దరఖాస్తుల సమర్పణకు తుదిగడువు ఈనెల 31వ తేదీ వరకు అవకాశముందని పేర్కొన్నారు. వీలైనంత తొందరగా దరఖాస్తు చేయాలని అభ్యర్థులను కోరారు. ఇతర వివరాలకు www.tspsc.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. వన్‌టైం రిజిస్ట్రేషన్ (ఓటీఆర్)కు సంబంధించి కొత్తగా 68,793 మంది, సవరణ చేసుకున్న వారు 1,54,785 మంది అభ్యర్థులు కలిపి 2,23,578 మంది పూర్తి చేసుకున్నారని వివరించారు.