Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రతి ఏడాది మే మొదటి మంగళవారం ప్రపంచ ఆస్తమా దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ప్రపంచంలో 23.5 కోట్ల మంది వ్యాధిగ్రస్తులుండగా, భారతదేశంలో 1.5 కోట్ల మంది ఉన్నారు. బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో దీనిపై అవగాహన పెంచుకోవాలని డాక్టర్లు ప్రజలను కోరుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఒక్క 2015లోనే ఆస్తమా కారణంగా 3.83 లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. 11 ఏండ్లలోపు చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆస్తమా రావడానికి ఆహారపు అలవాట్లు, వాతావరణ పరిస్థితులతో పాటు వంశపారంపర్యమైన విషయాలు కూడా కారణమని భావిస్తున్నారు. చర్మవ్యాధులున్న చిన్నారులకు ఈ వ్యాధి వచ్చే అవకాశమెక్కువని వైద్యులు చెబుతున్నారు. ధూమపానం, మద్యపానం, వాయు కాలుష్యం, రసాయనాలు కూడా ఆస్తమా రావడానికి కారణాలు. పొగ తాగే అలవాటున్న తల్లి ప్రభావం కడుపులో బిడ్డపై పడి ఆస్తమా రావచ్చు. దుమ్ము, ధూళి, జంతువుల వెంట్రుకలు తదితర అంశాలు కూడా ఈ వ్యాధికి కారకాలు.
పిల్లల విషయంలో జాగ్రత్త...డాక్టర్ జి.సురేంద్రబాబు
పిల్లలు ఆడుకున్న తర్వాత ఆస్తమా వస్తుందనే కారణంతో వారిని అటలకు దూరం చేయవద్దని పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ జి.సురేంద్రబాబు సూచించారు. చల్లటి గాలిలో తిరగకపోవడం, తేలికైన ఆటలు ఆడటం, ఆటల సందర్భంగా నిదానంగా గాఢంగా గాలి తీసుకుని వదలడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఆటలకు ముందు ఇన్ హేలర్లు వాడటం వల్ల కూడా నిరోధించవచ్చని చెప్పారు.