Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్లతో మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆస్పత్రుల్లో పరిస్థితులను తెలుసుకునేందుకు వీలుగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం ఆయన హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 108, 102 అమ్మ ఒడి అంబులెన్స్ సేవలపై సమీక్షించాలనీ, ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ ఉండేలా వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించి నియామకాలను ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. సీ సెక్షన్ ఆపరేషన్లను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలనీ, వాటిపై ఆడిట్ నిర్వహించాలనీ, సహజ ప్రసవంతో తల్లికి, శిశువుకు నష్టం అనుకున్నప్పుడు మాత్రమే సీ సెక్షన్ చేసేలా జాగ్రత్త వహించాలన్నారు. ఏఎన్సీ పరీక్షలు సక్రమంగా నిర్వహిస్తే మాతా, శిశు మరణాలను తగ్గించడం సాధ్యమవుతుందని అన్నారు. ఈ క్రమంలో వంద శాతం ప్రసవాలు ఆస్పత్రుల్లో జరిగేలా చూడాలని కోరారు. నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఎన్సీడీ) పరీక్షల డేటాను ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయాలన్నారు. ఆస్పత్రుల పారిశుధ్యం, డైట్ సేవలను సమీక్షించి, వాటికి సంబంధించి కొత్త టెండర్లు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని హరీశ్ రావు కలెక్టర్లను కోరారు. రాష్ట్రంలో 636 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 232 అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామనీ, ఈ ప్రక్రియ పూర్తయితే జిల్లా కలెక్టర్లు సైతం దవాఖానాల తీరుతెన్నులను పరిశీలించే వెసులుబాటు ఉంటుందని తెలిపారు. కొత్త మెడికల్ కాలేజీలకు సంబంధించి భూ కేటాయింపు ప్రతిపాదనలను త్వరగా పంపించాలని ఆదేశించారు. వడగాలుల నుంచి రక్షణ పొందేందుకు అవసరమైన జాగ్రత్తల విషయంలో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.
నెలకు ఒక రోజు : సోమేశ్ కుమార్
సీఎం కేసీఆర్ వైద్యరంగాన్ని పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారనీ, అందువల్ల జిల్లా కలెక్టర్లు ప్రతి నెలా ఏదో ఒక రోజు వైద్యారోగ్యంపై పూర్తిస్థయిలో సమీక్షించాలని సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు. ఎక్కడికి వెళ్లినా సమీపంలోని ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ వాకాటి కరుణ, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజరు కుమార్, డీఎంఈ డాక్టర్ కె.రమేశ్ రెడ్డి, డీహెచ్ డాక్టర్ జి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.