Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బెంచీకి ఒకరు, తరగతి గదికి 24 మంది
- వెబ్సైట్లో హాల్‌టికెట్లు
- ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పరీక్షలు పూర్తయిన నెలరోజుల్లో ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల చేసేందుకు కృషి చేస్తున్నామని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ చెప్పారు. కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని వివరించారు. ఈనెల ఆరో తేదీ నుంచి 24వ తేదీ వరకు ఇంటర్మీడియెట్ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకర్లతో ఆయన మాట్లాడుతూ బెంచీకి ఒకరు, తరగతి గదికి 24 మంది నుంచి 30 మంది విద్యార్థుల వరకు కూర్చుని పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 4,64,626 మంది, ద్వితీయ సంవత్సరంలో 4,42,768 మంది కలిపి మొత్తం 9,07,394 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని చెప్పారు. వారికోసం 1,443 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. 25 వేల మంది ఇన్విజిలేటర్లను నియమించామన్నారు. ఈ పరీక్షల నిర్వహణ కోసం డీఈసీలను ఏర్పాటు చేశామని వివరించారు. ఫీజు చెల్లిస్తేనే హాల్‌టికెట్లు ఇస్తామంటూ ప్రయివేటు, కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాలు కొందరు విద్యార్థులను భయాందోళనలకు గురిచేస్తున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుందని అన్నారు. విద్యార్థులు హాల్‌టికెట్ల కోసం కాలేజీలకు వెళ్లాల్సిన పనిలేకుండా వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని వివరించారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పరీక్షా సమయంలో నిరంతర విద్యుత్ ప్రసారం జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు.