Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎమ్మెల్సీ దాచూరి రామిరెడ్డి వర్ధంతి సభలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలందరికీ నాణ్యమైన విద్యను అందించటానికి కృషి చేయటమే దాచూరి రామిరెడ్డికి నిజమైన నివాళి అని వక్తలు అన్నారు. ఉపాధ్యాయ ఉద్యమం జాతీయ నాయకులు, యూటీఎఫ్ పూర్వ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ దాచూరి రామిరెడ్డి ఆరో వర్ధంతి సభ సోమవారం హైదరాబాద్‌లోని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎస్‌యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి చావ రవి మాట్లాడుతూ ఉపాధ్యాయులు హక్కులు, బాధ్యతలకు సమ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. అధ్యయనం, అధ్యాపనం, సామాజిక స్పృహ లక్ష్యాలతో ఉపాధ్యాయ ఉద్యమాన్ని నడపాలని ఉపాధ్యాయులకు ఉద్బోధించిన మహానాయకుడు దాచూరి అని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల మెరుగుదల కోసం, ఉపాధ్యాయుల నియామకం కోసం పోరాడాలని అన్నారు. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు సిద్ధపడాలని నిరంతరం ఆయన చెప్పేవారని వివరించారు. ఉపాధ్యాయులు వృత్తి నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ విద్యారంగం పట్ల పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మెజార్టీ పిల్లలు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలలను ఏడేండ్లుగా పట్టించుకోలేదన్నారు. ఇప్పుడైనా మౌలిక సౌకర్యాలు, ఉపాధ్యాయులు, పారిశుద్ధ్య సిబ్బంది కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. పర్యవేక్షణ వ్యవస్థను పటిష్టం చేయాలనీ, ప్రభుత్వ పాఠశాలల పట్ల తల్లిదండ్రులకు నమ్మకం కలిగించాలని కోరారు. టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కె జంగయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ఆర్ శారద, పత్రిక ప్రధాన సంపాదకులు పి మాణిక్‌రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండలరావు, ఆంజనేయులు, వెంకటప్ప, జయసింహారెడ్డి, శ్యామ్ సుందర్, రమేష్, సీనియర్ నాయకులు దత్, మస్తాన్‌రావు తదితరులు పాల్గొన్నారు.