Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొదటిదశలో 9,123 స్కూళ్లలో రూ.3497.62 కోట్లతో అభివృద్ధి
- కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆదేశాలతో రాష్ట్రం లోని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు వీలుగా మౌలిక వసతుల కల్పనకు చేపట్టిన 'మనఊరు-మనబడి' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రులు పి సబితా ఇంద్రారెడ్డి, టి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం అమలుకు నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. 'మనఊరు-మనబడి' కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి టి హరీశ్‌రావు సోమవారం హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, హెల్త్ డైరెక్టర్ జి శ్రీనివాసరావు, ఆరోగ్య శాఖ ఓఎస్డీ డి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ 'మనఊరు-మనబడి' కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దెందుకు ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. ఇందులో భాగంగా మొదటి దశలో 9,123 పాఠశాలల్లో రూ.3,497.62 కోట్లతో 12 రకాల మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తున్నామని వివరించారు. రూ.30 లక్షల్లోపు పనులను పాఠశాల నిర్వహణ కమిటీ (ఎస్ఎంసీ) లకు అప్పగించామని వెల్లడించారు. రూ.30 లక్షల పైబడి పనులను టెండర్ల ద్వారా చేపడుతున్నట్టు చెప్పారు.
టి హరీశ్‌రావు మాట్లాడుతూ 'మనఊరు-మనబడి' కార్యక్రమానికి నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే అన్ని జిల్లాలకూ అడ్వాన్స్‌గా నిధులను విడుదల చేశామన్నారు. విద్యా యజ్ఞంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో మంజూరు చేసిన పనులన్నింటినీ సీనియర్ అధికారులతో తనిఖీ చేయించాలని కోరారు. పనుల ప్రారంభానికి ముందు పాఠశాల ఏ విధంగా ఉంది, తర్వాత ఏ విధంగా మారిందనే దానిపై ఫొటోలు తీయించాలని సూచించారు. ప్రతి మండలానికీ ఒక ప్రత్యేక అధికారిని నియమించి పనులను నాణ్యతతో, త్వరిత గతిన పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సీఎస్ సోమేశ్‌కుమార్ మాట్లాడుతూ రూ.30 లక్షల్లోపు పనులన్నింటికీ ఈనెల పదో తేదీలోపు పరిపాలన అనుమతులు మంజూరు చేయాలని కోరారు. 15వ తేదీ నాటికి పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రూ.30 లక్షలకు పైబడ్డ పనులకు ఈనెలాఖరు వరకు టెండర్ల పక్రియను పూర్తిచేసి చేపట్టాలని సూచించారు.