Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హక్కుల పునరుద్ధరణకు కార్మికులు పోరు నడపాలి
- కేంద్రం కార్మిక చట్టాల కోరాలు చీల్చింది
- కార్మికుల్లో 136 ఏండ్ల కిందటి పరిస్థితి నెలకొంది
- మతోన్మాద శక్తులు.. కార్మికుల మధ్య చిచ్చుపెడుతున్నాయి
- సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్. వీరయ్య
- రంగారెడ్డి జిల్లా కాటేదాన్ క్లస్టర్లో మేడే ఉత్సవ వేదిక ప్రారంభం
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
స్వాతంత్య్రానికి ముందు, తర్వాత కార్మికుల పోరాటాల ఫలితంగా సాధించుకున్న హక్కులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాలరాస్తోందని, పరిశ్రమల్లో 136 ఏండ్ల కిందటి పరిస్థితి కనిపిస్తోందని, నాటి పరిస్థితులను వ్యతిరేకిస్తూ తమ హక్కుల కోసం పోరాడి అమరులైన వారి స్ఫుర్తితో కార్మికులు పోరుబాట పట్టాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్. వీరయ్య పిలుపునిచ్చారు. మేడే సందర్భంగా పారిశ్రామిక వాడల్లో మేడే వారోత్సవాలు నిర్వహించాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రంగారెడ్డి జిల్లా కమిటీ, కాటేదాన్ క్లస్టర్ కమిటీ ఆధ్వర్యంలో పారిశ్రామిక వాడలో ఏర్పాటు చేసిన మేడే ఉత్సవ వేదికను సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. పెట్టుబడిదారుల లాభాల కోసం రాత్రి, పగలు తేడా లేకుండా కార్మికులు కార్మాగారాల్లో మగ్గుతూ తమ వ్యక్తిగత జీవితాన్ని ధారపోశారన్నారు. అలాంటి దీనస్థితిలో నుంచి చికాగో నగరంలో పుట్టిన ఉద్యమం నాలుగు రోజుల పాటు సాగిందని, ఎంతో మంది కార్మికులు అమరులయ్యారని, వారి స్ఫూర్తితో నేడు ప్రపంచ వ్యాప్తంగా మేడే ఉత్సవాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. స్వాత్రంత్యానికి ముందు 1926లో యూనియన్ పెట్టుకునే హక్కు, వేతన చెల్లింపుల హక్కు, ఫ్యాక్టరీ చట్టం, యాజమాన్య ఒప్పంద హక్కు, బేరసారాల హక్కులు సాధించుకున్నామని తెలిపారు. స్వాతంత్య్రానంతరం నాటి కాంగ్రెస్ ప్రభుత్వం సరళీకృత విధానాల్లో భాగంగా కార్మిక చట్టాల్లో కొత్త విధానాలు తెచ్చేందుకు చేసిన ప్రయత్నాలను కార్మిక రంగం తిప్పికొట్టిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరణ చేయడానికి కూడా ఏర్పాట్లు చేశారన్నారు. అలాంటి విధానాలను వ్యతిరేకిస్తూ జాతీయ కార్మిక సంఘాలు 21 సార్లు సమ్మె చేయడంతో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్నారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశభక్తి పేరుతో గద్దెనెక్కి.. కార్మికుల హక్కులు హరిస్తుందని విమర్శించారు. ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న 29 కార్మిక చట్టాలు, హక్కులను కాలరాస్తూ.. నాలుగు లేబర్ కోడ్స్‌గా తీసుకువచ్చి కార్మికులను పెట్టుబడిదారుల చేతిలో బానిసలుగా మార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బానిస బతుకుల నుంచి గట్టేకాలంటే కార్మికులు ఉద్యమాలకు సిద్ధం కావాలన్నారు. ఏడాది పాటు దేశ రాజధాని సరిహద్దులో రైతులు చేసిన పోరాటం ఫలితంగా వ్యవసాయ నల్ల చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకుందని గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో నాలుగు లేబర్ కోడ్స్ విధానాన్ని రద్దు చేసే వరకూ కార్మికులు నిర్విరామ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహించే మేడే ఉత్సవాల్లో కుల, మత, లింగ బేధాలు లేకుండా అందరూ పాల్గొని భవిష్యత్ ఐక్య ఉద్యమాలకు చైతన్యవంతులు కావాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి చంద్రమోహన్, శ్రామిక మహిళ కన్వీనర్ కవిత, కాటేదాన్ క్లస్టర్ కన్వీనర్ రుద్రకుమార్, సీఐటీయూ నాయకులు మల్లేశ్, కుర్మయ్య, రామ్మోహన్, రవి, భాస్కర్, ప్రేమాజీ, తధితరులు పాల్గొన్నారు.