Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు
- పీఎన్జీ పరిశ్రమలో లిక్విడ్ డిటర్జెంట్ ప్లాంట్ ప్రారంభం
నవతెలంగాణ-కొత్తూరు
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనేక స్వదేశీ, విదేశీ కంపెనీలు ముందుకు వస్తున్నాయని, పరిశ్రమల హబ్‌గా తెలంగాణ రాష్ట్రం మారిందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా కొత్తూర్ మండలం పెంజర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని పీఎన్జీ పరిశ్రమలో నూతనంగా ఏర్పాటు చేసిన లిక్విడ్ డిటర్జెంట్ ప్లాంట్‌ను మంత్రి సబితా ఇంద్రారెడ్డి, షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. అలాగే తుక్కుగూడ మున్సిపాలిటీ రావిరాలలో ఈ సిటీలో రేడియంట్ ఎలక్ట్రానిక్స్ యూనిట్‌నూ ప్రారంభించారు. భవిష్యత్తులో పూర్తిగా లిక్విడ్ డిటర్జెంట్ మాత్రమే ఉండబోతుందని, దాన్ని దృష్టిలో పెట్టుకొని రూ.200కోట్లతో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేశామని పరిశ్రమ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. పీఎన్జీ పరిశ్రమ ప్రతినిధులు కరోనా కష్టకాలంలో దాదాపు రూ.6 కోట్ల విలువచేసే మాస్క్‌లు, శానిటైజర్ బాటిల్స్ ప్రభుత్వానికి అందజేశారని తెలిపారు. ఆరేండ్ల కిందట పీఎన్జీ పరిశ్రమను సీఎం కేసీఆర్ ప్రారంభించారని, నాటి నుంచి నేటి వరకు ఎంతో మందికి ఉపాధి అవకాశాలు దొరికాయన్నారు. స్థానికులకూ ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరారు. ప్రస్తుతం పీఎన్జీ పరిశ్రమ విద్యాభివృద్ధికి చేస్తున్న కృషిని ఈ సందర్భంగా కేటీఆర్ అభినందించారు. దేశంలోనే అతిపెద్ద ఎల్ఈడీ రేడియంట్ కంపెనీ తెలంగాణలో ఉందని, ఆ కంపెనీ నుంచి 50 లక్షల టీవీలు తయారు చేయడం తెలంగాణకు గర్వకారణమన్నారు. రేడియంట్ కంపెనీలో 3,800ల మందికిపైగా పని చేస్తున్నారన్నారు. యూనిట్ తయారీలో మొదటేడాది 4 లక్షల టీవీలను తయారు చేద్దామని అనుకున్నారని తెలిపారు. ఇప్పుడు నెలకు 4 లక్షల టీవీలను తయారు చేసే స్థాయికి ఎదగడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో స్థానిక మండల పరిషత్ అధ్యక్షులు పిన్నింటి మధుసూదన్‌రెడ్డి, జడ్పీటీసీ ఎమ్మె శ్రీలత సత్యనారాయణ, సర్పంచ్ మామిడి వసుందరమ్మ, నాయకులు ఎమ్మె సత్యనారాయణ, ఆర్డీవో రాజేశ్వరి, తహసీల్దార్ రాములు, ఎంపీడీవో శరత్ చంద్రబాబు, పీఎన్జీ పరిశ్రమ ప్రతినిధులు, పెంజర్ల గ్రామపంచాయతీ వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.