Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముట్టుకుంటే షాక్ కొడుతున్న వైనం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఎండలు మండుతున్నారు...24 గంటలు కరెంటు అందుబాటులో ఉంది...సౌకర్యం కోసం ఫ్యాన్లు, ఏసీలు తిరుగుతూనే ఉన్నాయి...సహజంగానే వేసవి కాలంలో ఇతర సీజన్లకంటే ఎక్కువ కరెంటు బిల్లు వస్తుంది. కానీ ఈసారి వేసవి సీజన్లో ఇండ్లకు వస్తున్న కరెంటు బిల్లులు ముట్టుకుంటే షాక్ కొట్టిస్తున్నాయి. కొత్త టారిఫ్‌లో 15 శాతం కంటే ఎక్కువగా కరెంటు చార్జీలు పెరగడంతో వేసవిలో సహజంగా రూ.500 వచ్చే ఇంటికి ఇప్పుడు ఏకంగా దాదాపు రూ.700 కుపైగా బిల్లు వస్తున్నది. చిన్న చిన్న షాపుల్లో ఉన్న కమర్షియల్ మీటర్లు రివ్వున తిరిగి తలకు మించిన భారంగా మారుతున్నాయి. కరెంటు చార్జీల పెంపుదలపై వామపక్షాలు సహా ప్రతిపక్షాలు రోడ్లపైకి వచ్చి పలురూపాల్లో ఆందోళనలు చేస్తే, ప్రజల నుంచి స్పందన అంతంత మాత్రంగానే వచ్చింది. ఇప్పుడు చేతిలో కరెంటు బిల్లులు పడ్డాక 'షాక్'కు గురై సర్కారును శాపనార్థాలు పెట్టడం మినహా ఏమీ చేయలేని నిస్సహాయులుగా విద్యుత్ వినియోగదారులు మిగిలిపోయారు. ఆర్టీసీ బస్సు చార్జీలు పెరిగితే ప్రజల నుంచి పెద్దగా వ్యతిరేకత వ్యక్తం కాలేదు. దీనితో టీఎస్ఆర్టీసీ యాజమాన్యం చార్జీల పెంపును ప్రజలు ఆమోదించారని బాహటంగానే ప్రకటించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు విద్యుత్ సంస్థలు కూడా ఇదే తరహా ప్రకటన చేసేందుకు సిద్ధపడుతున్నాయి. కొత్త టారిఫ్ రేట్లను ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తెస్తూ తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. దాని ఫలితం మే నెల మొదటి వారంలో వినియోగదారులకు వస్తున్న కరెంటు బిల్లుల్లో కనిపిస్తున్నది. టారిఫ్‌తో పాటు కష్టమర్ చార్జీలను కూడా భారీగా పెంచిన విషయం తెలిసిందే. గతంలో ఈ చార్జీలు కొన్ని కేటగిరీలకు లేవు. ఇప్పుడు ఎవర్నీ వదలకుండా అందరికీ ఈ చార్జీలను వడ్డించారు. దీనితో కరెంటు బిల్లులు చూసి వినియోగదారులు 'బేర్' మంటున్నారు. భారం పడ్డాకైనా ప్రజల్లో చైతన్యం వచ్చి, సర్కారుపై పోరుకు సిద్ధమైతే కొంతైనా చార్జీల భారం తగ్గుతుందని ఓ ప్రతిపక్షనేత చెప్పుకొచ్చారు.