Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విచ్ఛిన్న, విభజన ఉద్యమాలపై పోరాటాలు చేయాలి బీజేపీ విధానాలను తిప్పికొట్టాలంటే కార్మిక, కర్షక మైత్రి అత్యావశ్యకం : సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు
- చర్లపల్లి పారిశ్రామికవాడలో 136 అడుగుల అరుణపతాక ప్రదర్శన
- అందరికీ ఉపాధి, భూమి, ఆహారం, ఇల్లు, విద్యా,వైద్యం కోసం పోరాటాలు : బి.వెంకట్
- పోరాటం కార్మికుల జన్మహక్కు..కాలరాయాలని చూస్తే ఊరుకోం : పాలడుగు భాస్కర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఓవైపు నిత్యావసర సరుకుల ధరలు పెరుగుదల, మరోవైపు దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టే బీజేపీ సర్కారు విధానాలపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతున్నదనీ, దాని నుంచి బయట పడేందుకే మోడీ సర్కారు కులం, మతం, ప్రాంతం పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుతున్నదని సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు చెప్పారు. బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు కార్మిక, కర్షక ఐక్యత సాధిస్తూనే విచ్ఛిన్న, విభజన ఉద్యమాలపై పోరాటాలను తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. సోమవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో చర్లపల్లి పారిశ్రామిక వాడలో చర్లపల్లి ఇండిస్టీయల్ ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ అనుబంధం) ఆధ్వర్యంలో 136వ మేడేను పురస్కరించుకుని 136 అడుగుల అరుణపతాక ప్రదర్శన చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ చౌరస్తా నుంచి సూరారం చౌరస్తా వరకు ప్రదర్శన సాగింది. ఈ సందర్భంగా ఎం.సాయిబాబు మాట్లాడుతూ..పోరాడి సాధించుకున్న హక్కులను, చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనుకూలంగా మారుస్తూ కార్మిక వర్గాన్ని బానిసత్వంలో నెట్టుడుతున్నదని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆటలు ఇకసాగవనీ, 12 నుంచి 15 గంటల పనివిధానాన్ని ఆమోదించబోమని అఖిల భారత సమ్మె ద్వారా కార్మికవర్గం నిరూపించిందని చెప్పారు. దేశంలో ప్రత్యామ్నాయ విధానాలు అమలు చేయాల్సిన ఆవశ్యకతను కార్మికులకు విడమర్చి చెబుతామన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేయవద్దనీ, విద్యా,వైద్య రంగాలను ప్రభుత్వ ఆధీనంలోనే నిర్వహించేలా పోరాటాలను ఉధృతం చేయాలని సీఐటీయూ నిర్ణయించిందన్నారు. నేషనల్ మానిటైజేషన్ పైపులైన్ పేరుతో సహజవనరులను, జాతి సంపదను కారుచౌకగా స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారులకు కట్టబెట్టే కుట్రకు మోడీ సర్కారు పూనుకున్నదన్నారు. దాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపైనా ఉందని నొక్కి చెప్పారు. దేశభక్తిముసుగులో దేశాన్ని పరాధీనత చేసే కుట్రను తిప్పికొడతామన్నారు. అంతర్జాతీయ పెట్టుబడి ప్రపంచవ్యాప్తంగా కార్మికవర్గాన్ని దెబ్బతీస్తున్నదనీ, అందుకే మేడే సందర్భంగా అన్ని దేశాల్లోనూ కార్మికులు పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చి ప్రదర్శనలు చేశారని తెలిపారు.
అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ మాట్లాడుతూ.. దేశంలోని సామ్రాజ్యవాదులు, గుత్తపెట్టుబడిదారులు, భూస్వాములను ఓడించాలంటే కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు మరింత ఐక్యతతో పోరాటాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. నల్లచట్టాలు చేస్తూ ప్రశ్నించే వాళ్లందర్నీ జైళ్లలో పెడుతున్న కేంద్రం ప్రభుత్వం ప్రపంచానికి ఎలా ఆదర్శమవుతుందని ప్రశ్నించారు. దళిత ఎమ్మెల్యే జిగేశ్ మేవానికి అరెస్టు చేసి అస్సాం తీసుకెళ్లారనీ, కోర్టు బెయిలిచ్చిన వెంటనే మరో కేసు బనాయించడం దుర్మార్గమని పేర్కొన్నారు. దీనిపై న్యాయమూర్తి ప్రశ్నించినా, ఆగ్రహం వ్యక్తం చేసినా మోడీ సర్కారు గుడ్డిగా ముందుకెల్తున్నదని విమర్శించారు. ప్రపంచ ఆకలి సూచికలో చివరి నుంచి రెండోస్థానం (109వ స్థానం)లో ఉండటం సిగ్గుచేటన్నారు. ప్రజాస్వామ్య, లౌకిక, రాజ్యాంగ విలువలకు మోడీ సర్కారు తిలోదకాలిచ్చి ముందుకెళ్తున్నదని విమర్శించారు. అందరికీ ఉపాధి, భూమి, ఆహారం, ఇల్లు, విద్యా,వైద్యం అందివ్వాలనే డిమాండ్‌తో మే 16 నుంచి దేశవ్యాప్తంగా ఏఐఏడబ్ల్యూయూ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించబోతున్నామని ప్రకటించారు.
సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ.. పెట్టుబడిదారులు, పాలకవర్గాల ఒత్తిడితో పరిశ్రమలపై కార్మిక శాఖ పర్యవేక్షణ కొరవడిందన్నారు. లేబర్ కోడ్ల ద్వారా 12 గంటల పనిధానం తీసుకొచ్చి వేతనాల కోసం కార్మికులు బేరసారాలు ఆడే హక్కును, సంఘం పెట్టే హక్కును కాలరాయాలని చూస్తున్నదని విమర్శించారు. సీఓడీ విధానానికి తూట్లు పొడుస్తున్నదనీ, యాజమాన్యమిచ్చే వేతనమే తీసుకోవాలనే విధంగా చర్యలు తీసుకుంటున్నదని వివరించారు. ఈ చర్యలన్నింటినీ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. పోరాటం చేయడం కార్మికుల జన్మహక్కు అనీ, దాన్ని కాలరాసే పాలకులకు ఘోరీ కడతామని హెచ్చరించారు. ఆర్ఎస్ఎస్కు చెందిన సోషల్ మీడియా మేడే అంటే మోడీ, అమిత్‌షా, యోగి అని పోస్టులను పెడుతూ చరిత్రను మసకబార్చే ప్రయత్నాలకు పూనుకోవడం దారుణమని విమర్శించారు. కార్యక్రమంలో సీఐటీయూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి జె.చంద్రశేఖర్, సీఐఈయూ అధ్యక్షులు బీవై సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి జి.శ్రీనివాసులు, కోశాధికారి ఎమ్ఎస్రావు, నాయకులు మణికంఠ, నర్సింహ్మ, సంతోశ్, వసంతరావు, శ్రీనివాస్, చిన్నయ్య, నారాయణ, తదితరులు పాల్గొన్నారు.