Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ పాలనలో రాజ్యాంగ మూలాల విధ్వంసం: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-మహబూబాబాద్
సీపీఐ(ఎం), సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులుగా సేవలందించిన తోట భిక్షం స్ఫూర్తితో పాలకుల ప్రజావ్యతిరేక విధానాలపై కార్మికులు, ఉద్యోగులు, అన్ని తరగతుల ప్రజలు ఉద్యమించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. మోడీ పాలనలో రాజ్యాంగ మూలలను విధ్వంసం చేస్తున్నారని విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్తి గార్డెన్స్‌లో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సూర్నపు సోమయ్య అధ్యక్షతన తోట భిక్షం సంస్మరణ సభ సోమవారం నిర్వహించారు. తొలుత భిక్షం చిత్రపటానికి తమ్మినేని, ఇతర నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లర్పించారు. అనంతరం తమ్మినేని మాట్లాడుతూ.. ప్రజలు, కార్మికుల సమస్యలపై అధ్యయనం చేసి జన సమీకరణ చేసి ఐక్యపోరాటాలు నిర్మించడంలో భిక్షం ఎనలేని కృషి చేశారని కొనియాడారు. నిఖార్సైన కమ్యూనిస్టుగా నిత్యం ప్రజల్లోనే ఉండేవారన్నారు. భిక్షం మృతి పార్టీకి తీరని లోటన్నారు. భిక్షం కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. వామపక్షాలు లేనిదే దేశానికి భవిష్యత్తు, ప్రపంచానికి మార్గనిర్దేశకత్వం ఉండదని స్పష్టం చేశారు. దేశ స్వాతంత్య్రం అనంతరం అంబేద్కర్ నాయకత్వంలో రాజ్యాంగ పరిషత్ ఏర్పడిందని, నాలుగు ముఖ్య సూత్రాలపై దేశం నడుస్తోందని తెలిపారు. కాగా సదరు నాలుగు రాజ్యాంగం మూలాలను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దెబ్బతీసిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం మతోన్మాదంతో దేశాన్ని రావణకాష్టంగా మార్చుతోందని ఆరోపిం చారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థ లకు కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్, ఇతర నిత్యావసరాల ధరలను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యారని తెలిపారు. మహిళలు, విద్యార్థిను లపై అఘాయిత్యాలు పెరిగాయని చెప్పారు. భవిష్యత్తులో బలమైన ప్రజా ఉద్యమాల ద్వారా వామపక్షాలు ముందుకు సాగుతాయని తేటతెల్లం చేశారు. కేంద్ర కమిటీ సభ్యులు జి. నాగయ్య మాట్లాడుతూ.. తోట భిక్షం క్రమశిక్షణ కలిగిన నాయకుడని తెలిపారు.
ప్రజాసంఘాల సభ్యత్వం, పార్టీ విస్తరణ, తదితర కార్యక్రమాల్లో సమయపాలన పాటిస్తూ ఆదర్శంగా నిలిచేవారని గుర్తుచేశారు. అనేక కేసులు, నిర్బంధాలు ఎదురైనా ప్రజల పక్షాన పోరాడారని కొనియాడారు. సభలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే బండి పుల్లయ్య, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆకుల రాజు, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సువర్ణ సోమయ్య, శెట్టి వెంకన్న, గునిగంటి రాజన్న, అల్వాల వీరయ్య, కందునూరి శ్రీనివాస్, వెంకన్న, గాడిపెల్లి ప్రమీల, పట్టణ కార్యదర్శి బానోత్ సీతారాం, తోట భిక్షం కుటుంబీకులు సమ్మక్క, తోట యాకన్న, తోట శ్రీనివాస్, విజయ లలిత, కిరణ్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.