Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రీవెన్స్‌సెల్‌లో దరఖాస్తుల వెల్లువ
- మహబూబాబాద్ ఎమ్మెల్యేపై వృద్ధురాలు ఫిర్యాదు
- ఏండ్లు గడుస్తున్నా జెన్కో పరిహారం ఇవ్వలేదన్న గ్రామస్తులు
నవతెలంగాణ- విలేకరులు
రాష్ట్రప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టరేట్లలో సోమవారం గ్రీవెన్స్సెల్లు ఏర్పాటు చేసింది. దీంతో ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజావాణికి తరలివచ్చారు. అన్ని రకాల సమస్యలను అధికారులకు చెప్పుకున్నారు. వినతిపత్రాలను అందించారు. తన భూమి కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న ఎమ్మెల్యే శంకర్ నాయక్ డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని పేర్కొంటూ మహబూబాబాద్ కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో కడా లక్ష్మి అనే వృద్ధురాలు ఫిర్యాదు చేసింది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం ఖానాపురం గ్రామానికి చెందిన తనకు 1-26( ఎకరం ఇరవై ఆరు గుంటల)వ్యవసాయ భూమి ఉండేదని తెలిపింది. ఈ భూమిని 18- 11- 2021 తేదీన మహబూబాబాద్ ఎమ్మెల్యే బాణోత్ శంకర్ నాయక్‌కు ఎకరం రూ.20 లక్షల చొప్పున విక్రయించినట్టు పేర్కొంది. అదే రోజున మొత్తం డబ్బులు ఇస్తామని చెప్పి కేవలం 10 లక్షలు మాత్రమే ఇచ్చారని, మిగతా డబ్బులు ఇస్తానని చెప్పి కాగితంపై ఎమ్మెల్యే సతీమణి సీతామహాలక్ష్మీ సంతకం పెట్టినట్టు కొన్ని పత్రాలను గ్రీవెన్స్‌లో అధికారులకు చూపింది.
2009లో జెన్కో వారు తమ భూములను తీసుకొని ఇంతవరకు డబ్బులు చెల్లించలేదని, సుమారు 40 కుటుంబాలు సహాయం కోసం ఎదురుచూస్తున్నాయని డబ్బులు చెల్లించాలని చెల్పూర్ గ్రామస్తులు జయశంకర్ భూపాలపల్లి కలెక్టరేట్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. తన భూమి వివరాలు పాస్ బుక్ లో నమోదు కాలేదని మల్హర్ మండలం చిమన్తండా గ్రామస్తుడు తేరాల నర్సింగరావు దరఖాస్తు చేస్తున్నారు. ఇంటర్‌క్యాస్ట్ మ్యారేజ్‌కు సంబంధించి రేగొండ మండలం, రేపాక గ్రామస్తుడు చవాటి రాజు దరఖాస్తు చేసుకున్నారు. తన 20 గుంటల భూమి ప్రాజెక్టు కింద పోయిందని, పరిహారం ఇప్పించాలని మహాదేవపూర్ వాసి కేదారి సుశీల దరఖాస్తు చేసుకున్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి గ్రామానికి చెందిన యమనగండ్ల వసంత, చింతల ఆనంద్ ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో పెద్దలు వీరి పెండ్లికి ఒప్పుకోలేదు. దీంతో నాచారం గుట్ట వద్ద ఇద్దరూ పెండ్లి చేసుకున్నారు. అయితే ఇప్పుడు తమకు తమ తల్లిదండ్రల నుంచి ప్రాణ భయం ఉన్నదని సోమవారం ప్రజావాణిలో ఎస్పీ రోహిణీ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన ఎస్పీ.. బాధితులకు న్యాయం చేయాలని వెల్దుర్తి ఎస్సైకి సూచించారు.