Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండు గంటల పాటు జాతీయ రహదారిపై ఆందోళన
- గతంలోనూ ఆందోళనలు చేసిన రైతులు, పట్టించుకోని అధికారులు
- సోమవారం రికార్డు స్థాయిలో మార్కెట్కు ధాన్యం
- రైతులను మోసం చేస్తున్న దళారులు
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటన చేసిన కూడా సూర్యాపేట మార్కెట్లో అమలు చేయకపోవడంతో రైతులు రోడ్డెక్కారు. మార్కెట్లో సిండికేట్గా ఏర్పడి రైతులకు మద్దతు ధర కల్పించకుండా మోసం చేస్తుండటంతో ఆగ్రహించిన రైతులు హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని నిర్బంధించారు. కేసీఆర్ డౌన్.. డౌన్.. అంటూ నినాదాలు చేస్తూ రెండు గంటలపాటు ఆందోళన కొనసాగించారు. సీఎం చెప్పారని సన్నవడ్లను పండిస్తే రైతులను నట్టేట ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ మద్దతుధర విషయంలో రైతులు సూర్యాపేట అగ్రికల్చర్ మార్కెట్లో పెద్దఎత్తున ఆందోళన చేపట్టినా తీరు మార్చుకోకుండా గిట్టుబాటు ధర విషయంలో రైతులను నట్టేటా ముంచుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
హమాలీ సమ్మెతో మొదలు
సూర్యాపేటలోని వ్యవసాయ మార్కెట్ ఎదుట హమాలీ కార్మికులు రాస్తారోకోకు దిగారు. అధికారులు, కమీషన్ ఏజెంట్లు వేధిస్తున్నారని, 2018 నుంచి తమ లైసెన్సులు రెన్యువల్ చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. దాంతో ఒక్కసారిగా మార్కెట్లో కొనుగోళ్ళు నిలిచిపోయాయి. ఒకపక్క భారీగా వడ్లు మార్కెట్కు రావడంతో పాటు హమాలీలు సమ్మె చేస్తుండటంతో రైతులు అకాల వర్షాలు వస్తే వడ్లు ఆగం అవుతాయోమోనని రైతులు ఆందోళన చెందారు. దాంతో మార్కెట్ అధికారులు హమాలీలతో మాట్లాడి ఆందోళన విరమించినప్పటికీ మంగళవారం నుంచి వడ్లను తరలిస్తామని చెప్పడంతో రైతులు ఒక్కసారిగా మార్కెట్లో ఆందోళనకు దిగారు. అంతేకాదు, రూ.1401 ధరకు తక్కువకు వడ్లను కమిషన్ దారులు కొనుగోలు చేయొద్దని కలెక్టర్ ఆర్డర్స్ ఇచ్చినా అవేమీ పట్టించుకోకుండా రైతుల నుంచి సన్న వడ్లను రూ.1250 ధర నుంచి కొనుగోలు చేస్తుండడంతో ఒక్కసారిగా ఆగ్రహించిన రైతులు మార్కెట్ ఆఫీస్ ఎదుట ధర్నాకు దిగారు. మద్దతు ధర కల్పించడంతో పాటు నిలిచిపోయిన కొనుగోళ్ళు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ మార్కెట్ కమిటీ ఆఫీస్కు తాళం వేసి నిరసన తెలిపారు. అయినప్పటికీ మార్కెట్ పాలకవర్గం, ఆఫీసర్లు పట్టించుకోకపోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. దాంతో పోలీసులు రంగప్రవేశం చేసి సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా.. రైతులు మద్దతు ధర కోసం పట్టుబట్టి ఉండటంతో వారూ ఏమీ చేయలేకపోయారు. ట్రాఫిక్కు అంతరాయం లేకుండా ముందస్తుగా వాహనాలను మళ్లించారు. దాంతో రెండు గంటల పాటు హైవేపైనే రైతులు రోడ్డుకు అడ్డంగా వెహికిల్స్ రాకుండా అడ్డుకున్నారు.
సోమవారం రికార్డుస్థాయిలో మార్కెట్కు వడ్లు
గతంలో ఎన్నడూ లేని విధంగా సోమవారం ఈ సీజన్లో రికార్డు స్థాయిలో సూర్యాపేట మార్కెట్కు వడ్లను రైతులు తీసుకొచ్చారు. ప్రభుత్వం కొనుగోలుకేంద్రాలను ప్రారంభించినప్పట్టికీ కొనుగోళ్ళు ఆలస్యం అవుతుండటంతో రైతులు సూర్యాపేట మార్కెట్కు వడ్లను తీసుకొస్తున్నారు.42,760 బస్తాల వడ్లు మార్కెట్కు రాగా వీటిలో చింట్లు మాత్రమే అత్యధికంగా 23,035 బస్తాల వడ్లను మార్కెట్కు రైతులు తీసుకొచ్చారు.