Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విధుల్లోకి తీసుకుంటామని మార్చిలో సీఎం హామీ
- ప్రస్తుతం జోరందుకున్న ఉపాధి పనులు
- అధికారుల పిలుపు కోసం ఎఫ్ఏల ఎదురుచూపులు
- ఫీల్డ్ అసిస్టెంట్లకు ఇంకా అప్పగించని బాధ్యతలు
నవతెలంగాణ-రామారెడ్డి
ఫీల్డ్అసిస్టెంట్లను రెండేండ్లుగా విధులకు దూరం ఉంచిన ప్రభుత్వం.. మార్చి నెలలో తిరిగి తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు హర్షించారు. ఈ సందర్భంగా కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం సైతం చేశారు. కానీ హామీ ఇచ్చి నెలన్నర అవుతున్నా.. ఎదురుచూపులే తప్ప ఇప్పటికీ వారికి బాధ్యతలు అప్పగించలేరు. ప్రస్తుతం వేసవి నేపథ్యంలో ఉపాధి పనులు జోరందుకోగా.. వీరు మాత్రం ప్రభుత్వాధికారులు ఎప్పుడు పిలుస్తారా అని.. చేస్తున్న చిన్నచిన్న పనులను సైతం వదులుకొని ఎదురుచూస్తున్న పరిస్థితి. విధుల కోసం వేచి చూస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఉపాధి కూలీలు ఉండగా, కామారెడ్డి జిల్లాలో 5.83 లక్షల మంది ఉపాధి కూలీలు ఉన్నాయి. 2,77,487 జాబ్ కార్డులున్నాయి. వీరికి పనిచేయటానికి కావలసిన పత్రాలు, పని ప్రదేశాలను గుర్తించడం, ఆమోదింపజేయడం, పని ప్రదేశంలో నీరు, టెంట్లు, మెడికల్ కిట్లు ఉండేలా ఏర్పాటు చేయడంతో పాటు, కూలీలకు డబ్బులు అందే వరకు వెన్నంటే ఉండి ఫీల్డ్అసిస్టెంట్లు సహాయ సహకారాలు అందించేవారు. గతంలో జిల్లా వ్యాప్తంగా 323 మంది క్షేత్ర సహాయకులు పని చేశారు. రాష్ట్ర సాధన తర్వాత ఇచ్చిన హామీ మేరకు తమను పర్మినెంట్ చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. దాంతో ఫీల్డ్అసిస్టెంట్లు సమ్మెకు పిలుపునివ్వగా, 2020 మార్చి 12వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఫీల్డ్అసిస్టెంట్లను విధుల నుంచి తొలగించింది. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని రెండేండ్లుగా వారు వివిధ రూపాల్లో ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. తిరిగి విధుల్లోకి తీసుకుంటామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఈ ఏడాది మార్చి నెల 15వ తేదీన హామీ ఇచ్చారు. ఈ ప్రకటనతో క్షేత్ర సహాయకులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం సైతం చేశారు. హామీ అయితే ఇచ్చారు కానీ.. ఇంకా బాధ్యతలు అప్పగించలేదు. నూతన ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పనులు ప్రారంభమైనా, వారిని విధుల్లోకి తీసుకోకపోవడంతో అధికారుల పిలుపు కోసం ఎదురుచూస్తున్నారు. సీఎం హామీతో ఇతర పనులు చేసుకోలేక ఆదాయ మార్గం లేక సతమతమవుతున్నారు. తమకు బాధ్యతలు అప్పగించాలని కోరుతున్నారు. ఎంపీడీవోలకు సైతం వినతిపత్రాలు అందజేశారు. ఉపాధి క్షేత్ర సహాయకులను విధుల్లోకి తీసుకునే విషయంలో ప్రభుత్వం కాలయాపన చేయడం మంచిది కాదని కాంగ్రెస్ పార్టీకి చెందిన జడ్పీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి సూచించారు.
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం
ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ఇచ్చిన ప్రకటన ప్రకారం, ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. ప్రభుత్వ ఆదేశాల కోసం వేచి చూస్తూ ఇతర పనులు చేయలేక, చేస్తున్న పనులను సైతం వదులుకొని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నాము.
- బలరాం. ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం జిల్లా సెక్రెటరీ, కామారెడ్డి