Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీసీఎంబీ అధ్యయనంలో వెల్లడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గాలిలో కరోనాతో ఇన్ఫెక్షన్ పెరుగుతున్నదని తాజాగా సీసీఎంబీ అధ్యయనంలో వెల్లడైంది. ఈ మేరకు ఆ సంస్థ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్ సీసీఎంబీ, చండీఘడ్ సీఎస్ఐఆర్ - ఐఎంటెక్తో కలిసి హైదరాబాద్‌లోని పలు ఆస్పత్రుల్లో ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. అధ్యయన ఫలితాలు తాజాగా ఎయిరోసోల్ సైన్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. అయితే ఈ అధ్యయనం 2020 సెప్టెంబర్‌లో మొదలై జనవరి 2021లో ముగిసిన సంగతి తెలిసిందే. అప్పుడు సేకరించిన గాలిలో నమూనాలను ఆర్టీపీసీఆర్ టెస్టు చేయడం ద్వారా గాలిలో కరోనా ఉన్నట్టు నిర్దారించారు. తాజాగా సేకరించిన వాటిని సెల్‌కల్చర్ చేయడం ద్వారా ఆ నమూనాలు లైవ్‌గా ఉన్నట్టు గుర్తించారు. ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువగా పాజిటివ్ రోగులున్న ఐసోలేటెడ్ రూంలో గాలిలో 75 శాతం మేర వైరస్ ఉంటున్నట్టు, ఒకరు లేదా ఎవరు లేని ప్రాంతంలో 15.8 శాతం ఉంటున్నట్టు తమ అధ్యయనంలో తేలిందని సీసీఎంబీ శాస్త్రవేత్త డాక్టర్ శివరంజని మెహరిర్ తెలిపారు. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలనీ, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. అయితే ఈ రకంగా అది గాలిలో ఎంతకాలముంటుందనేది ఇంకా తెలియాల్సి ఉందని ఆమె చెప్పారు. ప్రస్తుత అధ్యయనం గాలి ద్వారా కరోనా వ్యాప్తికే పరిమితం కాదనీ, ఇతర అంటువ్యాధులను కూడా గుర్తించేందుకు దోహదపడుతుందని ప్రముఖ శాస్త్రవేత్త, సీసీఎంబీ మాజీ డైరెక్టర్ డాక్టర్ రాకేష్ మిశ్రా తెలిపారు.