Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాగితాల్లో లెక్కలు.. వాడిపోయిన మొక్కలు
- అడవిని వదలి పల్లెలకు వానరసేన
- అలంకారప్రాయంగా మారిన ఆహార ప్రాంగణాలు
నవతెలంగాణ-లింగంపేట్
కోతులు ఊర్లలోకి రాకుండా హరితహారంలో భాగంగా వాటికి ప్రత్యేక ఆహార ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. 18 రకాల మొక్కల నాటాల్సి ఉండగా.. కొన్ని మొక్కలు నాటి మమ అనిపించారు. పర్యవేక్షణ కొరవడటంతో నిర్వహణ గాలికొదిలేశారు. ఫలితంగా మొక్కలు ఎండిపోయాయి. దీంతో తిండి కోసం కోతులు ఊర్ల మీద పడుతున్నాయి. కోతుల తిండి కోసం కోట్ల రూపాయలు వెచ్చించినా ఫలితం లేకపోగా.. లెక్కలు మాత్రం కాగితాల్లోకి ఎక్కాయి.
గ్రామాల నుంచి కోతులు తిరిగి వాపస్ పోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 'కోతుల ఆహార ప్రాంగణాలు' ఏర్పాటు చేసింది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 526 గ్రామ పంచాయతీలకుగాను 141 గ్రామాల్లో ప్రత్యేకంగా ఆహార ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. మరికొన్ని చోట్ల అటవీ ప్రాంతాలకు ఆనుకొని ఉన్న గ్రామాల్లో కోతుల కోసం ప్రత్యేకంగా మొక్కలు నాటారు. అంత వరకు బాగానే ఉన్నా.. మొక్కల సంరక్షణ మరిచారు. ఫలితంగా మొక్కలు ఎండుముఖం పట్టాయి. మొక్కలు లేకుండా బోర్డు ఒక్కటే దర్శనమిస్తోంది.
కనిపించని 18 రకాల మొక్కలు
కోతుల ఆహార ప్రాంగణంలో అల్లనేరేడు, సీతాఫలం, జామ, వెలగా, చింత, మామిడి, సపోటా, బొప్పాయి, సీమ చింత, నేరేడు, దానిమ్మ, మొర్రి బాదం, ఇప్ప, ఉసిరి, అరటి, రామ సీతాఫలం, లాంటి 18 రకాల పండ్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం సూచించింది. అందుబాటులో లేకుంటే గ్రామ పంచాయతీ నిధులు వెచ్చించి నర్సరీల నుంచి కొనుగోలు చేసి నాటాల్సి ఉండగా.. కొన్ని మాత్రమే నాటారు. నాటిన కొన్ని మొక్కలకు కూడా సరిగ్గా నీళ్లు పట్టకపోవడం, సంరక్షణ చర్యలు చేపట్టకపోవడంతో ఎండుముఖం పడుతున్నాయి.
కోట్లల్లో ఖర్చు.. కాగితాల్లో లెక్కలు
జిల్లాలో 141 కోతుల ఆహార ప్రాంగణాల్లో ఏర్పాటు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఇందులో 1.27 లక్షల వివిధ రకాల మొక్కలు నాటారు. ఇందుకోసం గుంతల తవ్వకానికి రూ.24.30 లక్షలు, ప్రతినెలా మొక్క సంరక్షకులకు 6.39 లక్షలు చెల్లిస్తున్నట్టు లెక్కలు ఉన్నాయి. ఆహార ప్రాంగణం చుట్టూ కంచె ఏర్పాటు కోసం రూ.14 లక్షలకు పైగానే ఖర్చు చేసినట్టు సమాచారం. కోట్లాది రూపాయలు వెచ్చించినా.. ఆశించిన ఫలితం లేకుండా పోయింది. ఆహారం దొరక్కపోవడంతో వానర మూకలు గ్రామాల మీద దాడులు చేస్తున్నాయి. గుంపులు గుంపులుగా సంచరిస్తుండటంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి కోతుల వనాలపై దృష్టి కేంద్రీకరించి, పండ్ల మొక్కలను నాటి సంరక్షించే విధంగా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
వాడిపోయిన వాటి స్థానంలో కొత్త మొక్కలు
ఏపీడీ శ్రీకాంత్
కోతుల ఆహార ప్రాంగణంలో మొక్కలు ఎండిపోయినట్టు మా దృష్టికి రాలేదు. వాడిపోయిన వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటిస్తాం. మొక్కలు సరిగా ఎదిగేలా చర్యలు తీసుకునేందుకు గ్రామపంచాయతీలకు ఆదేశాలు జారీ చేస్తాం. మొక్కల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటాం.