Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాత పద్ధతిలోనే పేదలకు బియ్యం
- కిలో బియ్యం రూపాయి
నవతెలంగాణ-సిటీబ్యూరో
కరోనాతో ఉపాధి కోల్పోయి.. జీవనం అస్తవ్యస్తంగా మారిన నేపథ్యంలో.. రెండేండ్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఉచిత రేషన్ బియ్యం పంపిణీ నిలిచిపోయింది. ఏప్రిల్ వరకు ఉచితంగా బియ్యం ఇచ్చిన ప్రభుత్వం.. మే నుంచి రూపాయికి కిలో బియ్యం కొనసాగించేందుకు నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ వరకు ఉచిత బియ్యం పంపిణీ పొడిగించినా.. రాష్ట్ర సర్కారు మాత్రం ఈనెల నుంచే రేషన్ బియ్యాన్ని రూపాయికి కిలో చొప్పున పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల నేపథ్యంలో అధికారులు ప్రతి ఒక్కరికీ 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీకి చర్యలు చేపట్టారు.
ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా మే ఒకటి నుంచి రేషన్ పంపిణీ కొనసాగుతోంది. ఇప్పటివరకు సుమారు 35వేల మంది బియ్యం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఇటు పేదలు ఆందోళన చెందుతున్నారు. రెండేండ్ల కిందట కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దానికి కట్టడికి లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఫలితంగా అన్ని రంగాలు స్తంభించాయి. పేదలు, కార్మికులు, మహిళలు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతిఒక్కరికీ రేషన్ షాపుల ద్వారా ఒక్కొక్కరికి పది కిలోల చొప్పున ఉచితంగా బియ్యం అందించేందుకు చర్యలు చేపట్టాయి. దాదాపు 25 నెలలుగా ప్రతినెలా యూనిట్‌కు పది కిలోల చొప్పున రేషన్ బియ్యాన్ని ఉచితంగా అందించారు. దేశంలో కరోనా తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఇంకా పేదలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబర్ వరకు కేంద్రం ఉచిత బియ్యం పథకాన్ని పొడిగించింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కిలోకు రూ.1చొప్పున వసూలు చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇప్పటివరకు ఒక్కొక్కరికి ఇచ్చిన 5కిలోల ఉచిత బియ్యం స్థానంలో పాత పద్ధతి ప్రకారం ఇప్పుడు యూనిట్‌కు 6కిలోలు.. కిలోకు రూ.1చొప్పున వసూలు చేస్తుంది. అయితే ఉచిత బియ్యానికి ప్రభుత్వం స్వస్తి చెప్పడంపై అధికారులు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు.
ఈ నిర్ణయం ఫైనల్ కాకపోవచ్చునని, కేంద్రం ఉచిత కోటా కొనసాగిస్తున్న నేపథ్యంలో సర్కారు సైతం ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు. కాబట్టి గతంలో వివిధ కారణాలతో ఒక నెల కోటా ఇవ్వకున్నా.. తదుపరి నెలలో రెండు నెలలకు కలిపి కోటా మంజూరు చేసిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. మొత్తానికి అధికారులు చెబుతున్నట్టు ఉచిత కోటా పంపిణీపై రాష్ట్ర సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సిందే.
జిల్లాలో మొదలైన రేషన్ పంపిణీ..
జిల్లాలో మొత్తం తొమ్మిది సర్కిళ్ల పరిధిలో 673 పౌరసరఫరాల షాపులు ఉన్నాయి. వీటి పరిధిలో 6.36,559 రేషన్ కార్డులున్నాయి. ఇందులో ఆహార భద్రత కార్డులు 6.50 లక్షలకుపైగా ఉండగా.. అన్నపూర్ణ కార్డులు 1310, అంత్యోదయ కార్డులు 30,165 కార్డులున్నాయి. ఇందులో ఆహార భద్రత కార్డులదారులకు కిలోకు ఒక రూపాయి చొప్పున ఒక్కొక్కరికి 6కిలోల బియ్యం పంపిణీ చేస్తుండగా..అంత్యోదయ కార్డుదారులకు కిలోకు రూపాయి చొప్పున ఒక్కో కార్డుపై 35కిలోలు, అన్నపూర్ణ కార్డుదారులకు ఒక్కో కార్డుపై 10 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఇందుకోసం ఈ నెలలో 14వేల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం ఉండగా.. ఇప్పటికే అన్ని స్టాక్ పాయింట్లకు బియ్యం చేరింది. డీలర్ల సైతం సరఫరా పూర్తిచేస్తున్నారు. రంజాన్ పండుగ ముందు రోజే నుంచే పంపిణీ కొనసాగుతుండగా.. ఇప్పటివరకు 35వేల కార్డుదారులు రేషన్ బియ్యం తీసుకున్నారని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు.