Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ హరితనిధి పేరుతో విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారుల నుంచి వసూలు చేసే విధానాన్ని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఖండించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో ప్రవేశం పొందే క్రమంలో తెలంగాణ హరితనిధి పేరుతో నిధి వసూలు చేస్తున్నారని విమర్శించారు. ప్రాథమిక విద్యార్థులు రూ.ఐదు, ఉన్నత పాఠశాల విద్యార్థులు రూ.15, ఇంటర్ విద్యార్థులు రూ.25, డిగ్రీ విద్యార్థులు రూ.50, పీజీ, వృత్తివిద్యా కోర్సులు చదివే విద్యార్థులు రూ.వంద చెల్లించాలంటూ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. వ్యాపారుల నుంచి ట్రేడ్ లైసెన్స్ వాణిజ్య వ్యాపారుల నుంచి రూ.వెయ్యి, ఐఏఎస్, ఐపీఎస్ల నుంచి రూ.వంద, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వేతనాల నుంచి రూ.500, టీజీవో, టీఎన్జీవో ఉద్యోగుల వేతనాల నుంచి రూ.25 వసూలు చేయనుందని పేర్కొన్నారు. రెవెన్యూ భూమి అమ్మకం, కొనుగోలుపై రూ.50 వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. తెలంగాణ హరితనిధి పేరుతో బలవంతంగా విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారుల నుంచి వసూలు చేయడం సరైంది కాదని పేర్కొన్నారు. ఏ ప్రభుత్వ ఖాతా ద్వారా ఈ డబ్బంతా నిర్వహిస్తున్నారో ఇప్పటి వరకు ఎంత నిధిని వసూలు చేశారనే విషయాలపై శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు.