Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతు సంఘం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేసింది. ఆ ప్రక్రియలో అవకతవకలను అరికట్టాలని కోరింది. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి పదిహేను రోజులైనప్పటికీ ఆశించిన విధంగా కొనుగోళ్లు జరగడం లేదని తెలిపింది. రైతులు తమ ధాన్యాన్ని ప్రయివేటు వ్యక్తులకు తక్కువ ధరకు అమ్ముకుని తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈమేరకు మంగళవారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోతినేని సుదర్శన్రావు, టి. సాగర్ ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో 36 లక్షల ఎకరాల్లో వరి సాగైందనీ, అందులో 60 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని ప్రభుత్వం పేర్కొందని తెలిపారు. అందులో మార్కెట్లకు 50లక్షల టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ధాన్యం కొనడం ఆలస్యం కావడంతో కొంత మంది రైతులు కనీస మద్దతు ధర రూ.1960 కంటే తక్కువ ధరకు అమ్ముతున్నారని వివరించారు. గన్నీ బ్యాగులు, టార్పాలిన్ల కొరతను ప్రభుత్వం నివారించాలని డిమాండ్ చేశారు. కొనడం ఇంకా ఆలస్యమైతే, అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోయి రైతులు నష్టపోయే ప్రమాదముందని పేర్కొన్నారు. నాణ్యత ప్రమాణాల పేరుతో బస్తాకు మూడు కిలోల వరకు తరుగు తీయడం, బిల్లింగ్ అయిన తర్వాత అందులో వేసిన డబ్బులను తగ్గిస్తున్నారని పేర్కొన్నారు. గతేడాది మిల్లర్లు, కొనుగోలు సంస్థలు కలిసి రైతులకు నష్టం చేశాయని విమర్శించారు. తిరిగి అదే విధానాన్ని కొనసాగిస్తున్నారని తెలిపారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు ధాన్యం నాణ్యత కోల్పోందనీ, అయినా ధాన్యం ధర తగ్గించడం, తూకాన్ని తగ్గించడం సరైందికాదని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాలు, మిల్లర్లు కలిసి కుట్రల ద్వారా రైతులను మోసం చేయకుండా, అవకతవకలకు పాల్పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులను నష్టపరిచేందుకు అలవాటు పడ్డ మిల్లర్లు ఇప్పటికైనా తమ తప్పుడు విధానాన్ని మార్చుకోవాలని హెచ్చరించారు. అవకతవకలను అరికట్టడంతోపాటు తప్పుడు పద్ధతులు చేసే వారిపై విజిలెన్స్ శాఖ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.